AP CS And Dgp Attended Before Election Commission Of India: ఏపీలో ఈ నెల 13న (సోమవారం) పోలింగ్, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సీఎస్, డీజీపీలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్ జవహర్ రెడ్డి (Jawahar Redddy), డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) సీఈసీ ఎదుట గురువారం హాజరయ్యారు. రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై వారు వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ సైతం ఉన్నారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిల్లో పోలింగ్ రోజు, అనంతరం హింస చెలరేగడంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితిని ఎందుకు అదుపు చేయలేకపోయారని నిలదీసిన ఈసీ.. దీనికి బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించింది. హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరణ ఇవ్వాలని ఇరువురి ఉన్నతాధికారులను బుధవారం ఆదేశించిన నేపథ్యంలో గురువారం వీరు ఎన్నికల సంఘం ఎదుట హాజరయ్యారు.


ఈసీ తీవ్ర ఆగ్రహం..


దాదాపు 25 నిమిషాల పాటు వీరు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ఎదుట వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రి దాడులు, చంద్రగిరిలో ఏకంగా ఓ పార్టీ అభ్యర్థిపైనే దాడి చేయడం.. అటు, శ్రీకాకుళం నుంచి ఇటు కర్నూలు వరకూ జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశించినా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని మండిపడినట్లు సమాచారం. ముందస్తుగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించుకున్నారో.? దానికి తగిన ఏర్పాట్లు కూడా తమ దృష్టికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


ఇదీ జరిగింది


రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా అనంతరం కూడా పల్నాడు, తాడిపత్రి, తిరుపతి, మాచర్ల ప్రాంతాల్లో భారీగా హింస చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకరికొకరిపై రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులు, బాణాసంచాతోనూ దాడులు జరిగాయి. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతిలో చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న పులివర్తి నానిపై వైసీపీ కార్యకర్తలు మంగళవారం దాడికి పాల్పడ్డారు. అక్కడ స్ట్రాంగ్ రూంల పరిశీలనకు వెళ్లిన ఆయన తిరిగి వస్తున్న సమయంలో దాడి చేశారు. రాళ్లు, ఆయుధాలతో దాడి చేయగా.. నాని, ఆయన భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు నాని భద్రతా సిబ్బంది రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు ప్రతి దాడికి దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అటు, పల్నాడు జిల్లాలోని మాచర్ల, కారంపూడిలోనూ ఉద్రిక్తతలు చెలరేగాయి. అలాగే, అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలతో హింస చెలరేగింది. ఓ సీఐకు సైతం గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఈ ఘటనలన్నింటిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఇద్దరూ వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో గురువారం వారు ఎన్నికల సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.