Indian Railways Economy Meal: ప్రయాణీకుల నుంచి భారతీయ రైల్వేలు అందుకునే ఫిర్యాదుల్లో 'ఆహారం' ముందు వరుసలో ఉంటుంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో అందించే ఫుడ్‌ రుచిగా లేదని, శుచిగా లేదని, నాణ్యత బాగోలేదని, తక్కువ మోతాదులో అందిస్తున్నారని.. ఇలా చాలా కంప్లైంట్లు ప్రయాణీకుల నుంచి ఇండియన్‌ రైల్వేస్‌కు అందుతుంటాయి. రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని పాసింజర్లు తరచూ కోరుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని... దేశంలోని సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేలు కొత్త చొరవ తీసుకున్నాయి. 


'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (IRCTC) సహకారంతో, భారతీయ రైల్వేలు కొత్త పథకాన్ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా, రైల్వే ప్రయాణీకులకు "ఎకానమీ మీల్స్" అందించడం ప్రారంభించాయి. పరిశుభ్రమైన, రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని కేవలం 20 రూపాయలకే అందుబాటులోకి తెచ్చాయి.


2 రకాల భోజనం విక్రయం
ఈ చౌక ధర భోజనం (Economy Meal) పథకం కింద రెండు రకాల భోజనాలను అమ్ముతున్నారు. వాటిలో.. ఎకానమీ మీల్ ధర 20 రూపాయలు, అల్పాహారం ధర 50 రూపాయలు. జనరల్‌ రైల్‌ కోచ్‌లో ప్రయాణించే వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ భోజనాన్ని అందుబాటులోకి తెచ్చారు.


ఎకానమీ మీల్‌ కౌంటర్‌ విశేషాలు             
- తొలుత, 50 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు.        
- తర్వాత, దాదాపు 100 స్టేషన్లలో కొత్త ఎకానమీ మీల్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు.            
- ఇప్పుడు, దేశవ్యాప్తంగా 150 రైల్వే స్టేషన్లలో ఎకానమీ మీల్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి.           
- వీటిలో దక్షిణ మధ్య రైల్వేలో 12 స్టేషన్లు ఉన్నాయి.


ఐఆర్‌సీటీసీ, తన X హ్యాండిల్‌లో ఎకానమీ మీల్‌ కౌంటర్ల వీడియోను షేర్ చేసింది.


 






తెలుగు రాష్ట్రాల్లో ఏయే స్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది?
హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, విక్రమాబాద్, పాకాల, నంద్యాలతో పాటు పూర్ణ, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లలోనూ ఈ చౌక ధర భోజనం అందుబాటులో ఉంది. దీంతోపాటు, ప్లాట్‌ఫామ్‌ మీద, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌ ఆగే దగ్గర ఏర్పాటు చేసిన ఎకానమీ మీల్‌ కౌంటర్ల వద్ద మంచినీటిని కూడా అందుబాటులో ఉంచారు.


సెంట్రల్ రైల్వేలోని కర్జాత్, ఇగత్‌పురి స్టేషన్లలో కొత్తగా ఎకానమీ మీల్‌ కౌంటర్లు ఏర్పాటు చేయగా, పశ్చిమ రైల్వేలోని ముంబై సెంట్రల్, బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చారు.


మరో ఆసక్తికర కథనం:  టెస్లా ఉద్యోగులకు లేఆఫ్‌ల టెన్షన్, వేలాది మంది తొలగింపు!