Diwali Train Ticket Booking: దీపావళి పండుగను సొంత ఊర్లో, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. విద్య, ఉద్యోగం, ఇతర కారణాలతో ఊరు విడిచి వెళ్లిన వ్యక్తులు పండుగ సమయానికి స్వగ్రామాలకు పయనమవుతారు. ప్రస్తుతం, భారతదేశంలో రైలు ప్రయాణంలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. కన్ఫర్మ్‌డ్‌ టికెట్ పొందడం సవాల్‌గా మారింది. దీంతో ప్రయాణికులు ఒత్తిడికి గురవుతున్నారు. దీనిని పరిష్కరించడానికి ఐఆర్‌సీటీసీ వికల్ప్ స్కీమ్‌ను (IRCTC Vikalp Scheme) ప్రవేశపెట్టింది. కన్ఫర్మ్‌డ్‌ సీట్లు పొందేందుకు ఈ స్కీమ్‌ అవకాశం కల్పిస్తుంది.


వికల్ప్ పథకం అంటే ఏమిటి?
బుక్‌ చేసిన ట్రైన్‌ టిక్కెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే, వికల్ప్‌ స్కీమ్‌ ఆ ప్రయాణీకులకు మరొక ట్రైన్‌ ఆప్షన్‌ను అందిస్తుంది. వెయిట్‌ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులను అదే మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్లలోని సీట్లకు తమ టిక్కెట్‌ను బదిలీ చేసుకోవచ్చు. అయితే వికల్ప్ స్కీమ్‌ కన్ఫర్మ్‌డ్‌ సీటుకు హామీ ఇవ్వదు, కన్ఫర్మ్‌డ్‌ సీట్‌ను పొందే అవకాశాలను మాత్రమే పెంచుతుంది.


వికల్ప్ పథకం ఎలా పని చేస్తుంది?
వికల్ప్ స్కీమ్‌ను ఎంచుకున్నప్పుడు... మీ వెయిటింగ్‌ లిస్ట్‌ టిక్కెట్‌ను ఒరిజినల్‌ ట్రైన్‌ బయలుదేరే సమయం నుంచి 12 గంటల లోపు, రన్నింగ్‌లో ఉన్న మరొక రైలుకు బదిలీ చేసుకోవచ్చు. సీట్‌ కన్ఫర్మ్‌ కావడం కష్టమైన సందర్భాల్లో, దీపావళి వంటి పండుగల సమయంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరొక రైలులో సీటు అందుబాటులోకి రాగానే మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీ టికెట్‌ను రద్దు చేసుకుంటే మాత్రం క్యాన్షిలేషన్‌ ఛార్జీలు వర్తిస్తాయి.


వికల్ప్ స్కీమ్ కన్ఫర్మ్‌డ్‌ టికెట్ పొందే అవకాశాలను పెంచుతుంది. టిక్కెట్‌ లభ్యత ఆధారంగా... మీ ఎక్కవలసిన లేదా దిగవలసిన స్టేషన్‌లు కూడా మీ సమీపంలోని ఇతర స్టేషన్‌లకు మారొచ్చు. 


రైలు టిక్కెట్‌ బుక్‌ చేసేటప్పుడు వికల్ప్‌ పథకాన్ని ఎంచుకోవచ్చు:
-- IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ కావాలి.
-- మీ ప్రయాణ తేదీ, ఊరు, గమ్యస్థానం, ప్రయాణ తరగతిని ఎంచుకోండి.
-- మీ బుకింగ్‌ని కన్ఫర్మ్‌ చేయడానికి ప్రయాణీకుల సమాచారాన్ని నమోదు చేసి, డబ్బులు చెల్లించండి.
-- స్కీన్‌పై వికల్ప్‌ స్కీమ్‌ గురించి కనిపించగానే ఆ ఆప్షన్‌ను ఎంచుకోండి.
-- ప్రత్యామ్నాయ రైళ్లు అందులో కనిపిస్తాయి; మీకు అందుబాటులో ఉండే ఒకదాన్ని ఎంచుకోండి.
-- చార్ట్ తయారు చేసిన తర్వాత, ప్రత్యామ్నాయ రైలులో కన్ఫర్మ్‌డ్‌ టిక్కెట్‌ కోసం మీ PNR స్టేటస్‌ చెక్‌ చేయండి.


వికల్ప్ స్కీమ్‌ గురించి మరికొన్ని వివరాలు
-- వికల్ప్‌ స్కీమ్‌ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల కోసం మాత్రమే.
-- వికల్ప్‌ను ఎంచుకోవడానికి ఎటువంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.
-- వికల్ప్‌ను ఎంచుకున్న ప్రయాణీకులు ఇతర రైళ్లకు ఆటోమేటిక్‌గా మారతారు.
-- రైలు టిక్కెట్‌ మరొక రైలుకు బదిలీ జరిగితే, ఆ ప్రయాణీకుడు ఒరిజినల్‌ ట్రైన్‌లో ఎక్కలేడు.


పండుగ సీజన్లో ప్రయోజనాలు
దీపావళి వంటి పండుగల సమయంలో వెయిట్‌ లిస్ట్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. వికల్ప్ పథకం వల్ల కన్ఫర్మ్‌డ్‌ సీట్‌ అవకాశాలు పెరిగి, ప్రయాణీకుల టెన్షన్‌ తగ్గుతుంది. వెయిటింగ్‌ లిస్ట్‌లోని ప్రయాణీకులు అదనపు ఛార్జీలు లేకుండా, అదే రూట్‌లో ప్రయాణించే ఇతర రైళ్లలో సీట్లు పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అసలు టిక్కెట్‌కి మాత్రమే చెల్లిస్తారు, ప్రత్యామ్నాయ రైళ్లకు అదనపు ఛార్జీ ఉండదు. టిక్కెట్‌ను క్యాన్సిల్‌ చేసి, మరొక రైల్లో మళ్లీ బుక్‌ చేసుకోవాల్సిన ఇబ్బందులు తగ్గుతాయి.


మరో ఆసక్తికర కథనం: పోస్ట్‌మ్యాన్‌కు కబురు చేస్తే చాలు, మీ ఇంటి వద్దే 'డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌' సర్వీస్‌