TVS Supply Chain IPO: టీవీఎస్‌ సప్లై చైన్ సొల్యూషన్స్ ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్ (IPO) ఇవాళ (గురువారం, 10 ఆగస్టు 2023) ఓపెన్‌ అయింది. సోమవారంతో (14 ఆగస్టు 2023‌) ముగుస్తుంది. ఈ ఆఫర్‌ ద్వారా రూ. 880 కోట్లను ప్రైమరీ మార్కెట్‌ నుంచి సంపాదించాలన్నది కంపెనీ ప్లాన్‌. ఈ మొత్తంలో... ఫ్రెష్‌ షేర్ల జారీ ద్వారా రూ. 600 కోట్లు సమీకరిస్తుంది. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో మరో రూ. 280 కోట్ల విలువైన షేర్లను అమ్ముతారు.


ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే కంపెనీ ఖాతాలోకి వెళ్తుంది. ఈ డబ్బుతో... తన అనుబంధ సంస్థలైన TVS LI UK, TVS SCS సింగపూర్ చేసిన అప్పులను టీవీఎస్‌ సప్లై చైన్ సొల్యూషన్స్ తీరుస్తుంది, మిగిలిన డబ్బును సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వాడుకుంటుంది. OFS రూట్‌లో వచ్చిన డబ్బులు ఆయా ఇన్వెస్టర్ల జేబుల్లోకి వెళతాయి.


టీవీఎస్‌ సప్లై చైన్ IPOలో పార్టిసిపేట్‌ చేయాలా, వద్దా?


పబ్లిక్ ఆఫర్ కోసం, ఒక్కో షేర్‌ ప్రైస్‌ను రూ.187-197గా ఈ కంపెనీ నిర్ణయించింది. అయితే, ఈ షేర్‌ వాల్యుయేషన్‌ కొందరు మార్కెట్‌ ఎనలిస్ట్‌లకు నచ్చలేదు. చాలా ఎక్కువ ధరకు షేర్లను ఈ కంపెనీ అమ్ముతోందని అంటున్నారు. 


ఈ ఇష్యూను 'సబ్‌స్క్రైబ్‌' చేసుకోవచ్చని.., అయితే లిస్టింగ్‌ గెయిన్స్‌/షార్ట్‌టర్మ్‌ గెయిన్స్‌ కోసం కాకుండా లాంగ్‌టర్మ్‌ కోసం ఇన్వెస్ట్‌ చేయాలని పెట్టుబడిదార్లకు రిలయన్స్ సెక్యూరిటీస్ సూచించింది.


అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ అయిన రూ.197 వద్ద, TVS సప్లై చైన్ PE 209 రెట్లుగా (FY23) ఉంది. పోటీ కంపెనీలతో పోలిస్తే ఇది భారీ వాల్యుయేషన్‌. రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ కంపెనీ ఫాలో అవుతున్న అసెట్-లైట్ బిజినెస్ మోడల్ పెట్టుబడిదార్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అసెట్-లైట్ బిజినెస్ మోడల్ అంటే, సొంతంగా స్థిరాస్తులు కొనకపోవడం. దీనివల్ల పెట్టుబడి వ్యయం, నిర్వహణ ఖర్చులు మిగులుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని, షార్ట్‌-మీడియం టర్మ్‌ కోసం 'సబ్‌స్క్రైబ్‌' రేటింగ్‌ ఇచ్చింది జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్. 


మొత్తం ఇండస్ట్రీ PE కంటే ఈ కంపెనీ PE చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ IPOకు దూరంగా ఉండడం బెటర్‌ అని చెబుతూ "అవాయిడ్" రేటింగ్ ఇచ్చింది స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్.


లాట్‌ సైజ్‌, లిస్టింగ్‌ డేట్‌
ఒకవేళ, టీవీఎస్‌ సప్లై చైన్ సొల్యూషన్స్ ఐపీవోలో పార్టిసిపేట్‌ చేయాలనుకుంటే, పెట్టుబడిదార్లు లాట్‌ రూపంలో షేర్లు కొనాలి. ఒక్కో లాట్‌కు 76 షేర్లను కంపెనీ కేటాయించింది. 


విన్నింగ్‌ బిడ్డర్స్‌కు ఈ నెల 21న షేర్లు అలాట్‌ అవుతాయి. ఆ షేర్లు ఈ నెల 28న స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయి.


IPOలో 75% వాటాను క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బయ్యర్స్‌కు, 15% పోర్షన్‌ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 10% రిటైల్ ఇన్వెస్టర్లకు కంపెనీ రిజర్వ్ చేసింది.


కంపెనీ వ్యాపారం, లాభనష్టాలు
ఇది, లాజిస్టిక్స్ సొల్యూషన్స్‌ అందించే కంపెనీ. 2023 మార్చితో ముగిసిన సంవత్సరంలో (FY23), ఈ కంపెనీ రూ. 10,235 కోట్ల ఆదాయం & రూ. 41.76 కోట్ల లాభం ఆర్జించింది.


మరో ఆసక్తికర కథనం: షాపులకు వెళ్లట్లా, అంతా ఆన్‌లైన్‌ షాపింగే - ఎక్కువగా ఆర్డర్‌ చేస్తోంది వీటినే!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial