TVS Supply Chain Solutions IPO: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ప్లాన్‌లో ఉన్న టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ (TVS Supply Chain Solutions), మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ఈ వారం తాజా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేయబోతోంది. పబ్లిక్ ఆఫర్‌ను ఈసారైనా కచ్చితంగా ప్రారంభించాలన్న ఆలోచనతో కొత్త ముసాయిదా పత్రాలను సమర్పించబోతోంది. టీవీఎస్ మొబిలిటీ గ్రూప్‌నకు (TVS Mobility Group) చెందిన కంపెనీ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్.
దాదాదాపు ₹1,200 కోట్ల ఇష్యూ సైజ్
ఇష్యూ పరిమాణం దాదాపు ₹1,200 కోట్లుగా ఉండవచ్చు. ఫ్రెష్ షేర్ల జారీతో పాటు ప్రస్తుత పెట్టుబడిదార్ల నుంచి ఆఫర్ ఫర్ సేల్ (OFS) కూడా ఈ ఐపీవోలో ఉంటుంది. అయితే, పాత ఫైలింగ్ ప్రకారం OFSలో ఉన్న ప్రమోటర్లు, ఈసారి తప్పుకోవచ్చని తెలుస్తోంది.
ప్రైమరీ మార్కెట్ నుంచి ₹2,000 కోట్ల వరకు సేకరించేందుకు TVS సప్లై చైన్ గత సంవత్సరం ఫిబ్రవరిలో సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌లను దాఖలు చేసింది. తాజా ఈక్విటీ ఇష్యూతో పాటు, ప్రమోటర్ & ప్రస్తుత పెట్టుబడిదార్ల ద్వారా 59.5 మిలియన్ల వరకు ఈక్విటీ షేర్లను విక్రయిస్తామని డ్రాఫ్ట్ పేపర్‌లో పేర్కొంది. ఐపీఓను ప్రారంభించేందుకు అదే ఏడాది మే నెలలో ఈ కంపెనీకి సెబీ అనుమతి లభించింది. అయితే, అప్పట్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్ బాగా బలహీనపడడంతో IPOకు రాకుండా ఆలస్యం చేసింది. TVS సప్లై చైన్ DRHPకి లభించిన ఆమోదం వచ్చే నెల ప్రారంభంలో ముగుస్తుంది. అందువల్ల తాజా DRHP దాఖలు చేసేందుకు ఈ కంపెనీ నిర్ణయించింది.
కంపెనీలో ప్రస్తుత వాటాదార్లు ఒమేగా TC హోల్డింగ్స్ PTE, మహోగని సింగపూర్ కంపెనీ PTE, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, DRSR లాజిస్టిక్స్ సర్వీస్ పబ్లిక్ ఇష్యూ సమయంలో తమ షేర్లలో కొంత భాగాన్ని విక్రయించే అవకాశం ఉంది.
కంపెనీ ప్రమోటర్లు.. TVS మొబిలిటీ, TS రాజం రబ్బర్స్, ధిన్రమ మొబిలిటీ సొల్యూషన్, ఆర్.దినేష్. గత మూడు దశాబ్దాల్లో, TVS మొబిలిటీ విభాగం మొదటి IPO ఇదే అవుతుంది.
కంపెనీ ఆదాయం ₹10,000 కోట్లు!
IPO బ్యాంకర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం ₹10,000 కోట్లను అధిగమించగలదని అంచనా.
TVS సప్లై చైన్‌లో 18,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 25 దేశాల్లో సేవలు అందిస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వ్యాపారం చేస్తున్న లాజిస్టిక్స్ సొల్యూషన్ ప్రొవైడర్ ఈ కంపెనీ.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.