TBO Tech IPO News: భారత స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఐపీవోల హవా కొనసాగుతోంది. కరోనా తర్వాత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కాలేజ్ స్టూడెంట్స్ నుంచి ఉద్యోగుల వరకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది ఐపీవోలతో తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలను పొందేందుకు మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈక్విటీ మార్కెట్లలో ఒడిదొడుకులతో ట్రేడింగ్ చేయటం కంటే రెండు వారాల్లో డబ్బును రెట్టింపు చేస్తున్న ఐపీవోపై మనసు పారేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక కంపెనీ ఐపీవో మాత్రం ఇంకా ప్రారంభం కూడా కాకుండానే గ్రేమార్కెట్లో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది.
ఐపీవో వివరాలు..
టిబిఓ టెక్ కంపెనీ ఈవారం మార్కెట్లో సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇది మే 8న ప్రారంభమై మే 10న ముగియనుంది. కంపెనీ షేర్ల కేటాయింపు మే 13, 2024న ముగియనుంది. పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 16 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. తాజా ఐపీవో కోసం ప్రైస్ బ్యాండ్ విక్రయ ధరను షేరుకూ రూ.875-920గా ఉంచింది. ఇక్కడ ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో పాల్గొనేందుకు అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధర లెక్కన కనీసం రూ.14,720 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అయితే మరో మూడు రోజుల్లో తెరుచుకోవటానికి ముందే ఐపీవో గ్రేమార్కెట్లో ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న అపూర్వమైన స్పందనతో రోజుకో రికార్డు సృష్టిస్తోంది.
లాభాల సునామీ..
ఇన్వెస్టర్స్ గెయిన్ తాజా డేటా ప్రకారం ఆదివారం నాడు టిబిఓ టెక్ ఐపీవో షేరు గ్రేమార్కెట్లో అత్యధికంగా ఒక్కోటి రూ.520 ప్రీమియం ధరను పలుకుతున్నాయి. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగినట్లయితే కంపెనీ షేర్లు జాబితా రోజున రూ.1,440 వద్ద మార్కెట్లలో తెరుచుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే ఐపీవోకు దరఖాస్తు చేసుకుని అలాట్మెంట్ సమయంలో షేర్లను పొందిన ఇన్వెస్టర్ల సుడి తిరగనుంది. ఎందుకంటే కేవలం లిస్టింగ్ సమయంలో బలమైన ప్రీమియం కారణంగా 56.52 శాతం లాభాన్ని నిమిషాల్లో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు పొందుతారు. ప్రస్తుతం ఐపీవోకి యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, జెఫరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్‌మన్ సాచ్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎమ్ ఫైనాన్షియల్ లిమిటెడ్‌లను లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో పాటుగా ఆఫర్ ఫర్ సేల్ కూడా కలిగి ఉంది. ఐపీవో ఇండియన్ మార్కెట్ల నుంచి రూ.1,550.81 కోట్లను సమీకరించాలనే లక్ష్యతో ఈవారం మార్కెట్లోకి వస్తోంది. 2006లో ప్రారంభించబడిన కంపెనీ ప్రధానంగా టూరిజం రంగంలోని కంపెనీలకు, వ్యక్తులకు సేవలను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి ప్రమోటర్లుగా అంకుష్ నిజవాన్, గౌరవ్ భట్నాగర్, మనీష్ ధింగ్రా, అర్జున్ నిజవాన్ ఉన్నారు. దీనికి తోడు కంపెనీ బలమైన ఆర్థిక గణాంకాలతో లాభదాయకతను ప్రదర్శించటం ఇన్వెస్టర్లను ఐపీవో దిశగా ఆకర్షిస్తోంది.