Tata Technologies IPO: దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు టాటా గ్రూప్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ గ్రూప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ లిమిటెడ్‌గా మారబోతోంది.
TCS తర్వాత ఇదే
టాటా మోటార్స్ (Tata Motors) అనుబంధ కంపెనీ అయిన టాటా టెక్నాలజీస్ 'ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్' (Tata Technologies IPO) ప్రారంభించేందుకు, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి టాటా గ్రూప్ పత్రాలు దాఖలు చేసింది. అప్పుడెప్పుడో 2004లో TCS లిస్టింగ్ తర్వాత ఇప్పటి వరకు టాటా గ్రూప్ నుంచి మరో IPO రాలేదు. 18 సంవత్సరాల తర్వాత వస్తున్న టాటా గ్రూప్ మొదటి IPO ఇది.
టాటా టెక్నాలజీస్ IPO పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూట్‌లో జరుగుతుంది, ఒక్క ఫ్రెష్ షేర్‌ను కూడా జారీ చేయడం లేదు. ప్రమోటర్ ఎంటిటీ అయిన టాటా మోటార్స్ సహా ఇప్పటికే ఉన్న మరో ఇద్దరు షేర్‌హోల్డర్లు వాళ్ల వాటాలను అమ్మకానికి పెట్టబోతున్నారు.
IPO ద్వారా 95,708,984 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా అమ్ముతున్నారు, మొత్తం పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో ఇది దాదాపు 23.60%కు సమానం.
ప్రస్తుతానికి, టాటా టెక్నాలజీస్‌లో టాటా మోటార్స్‌కు 74.42% స్టేక్ ఉంది. టాటా క్యాపిటల్ అడ్వైజర్స్ ఆధ్వర్యంలో సింగపూర్ కేంద్రంగా నడుస్తున్న పెట్టుబడి సంస్థ ఆల్ఫా TC హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 8.96%, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్‌కు మరో 4.48% కలిగి ఉంది.
టాటా టెక్నాలజీస్ IPOలో... టాటా మోటార్స్ 81,133,706 వరకు ఈక్విటీ షేర్లను, ఆల్ఫా TC హోల్డింగ్స్ 9,716,853 ఈక్విటీ షేర్లను, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 4,858,425 షేర్లు ఆఫ్‌లోడ్ చేస్తాయి. కంపెనీ క్యాపిటల్‌లో ఇవి వరుసగా 20%, 2.40%, 1.20% కు సమానం.
వ్యాపారం - ఆదాయం
ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ హెవీ మెషినరీ సహా మరికొన్ని రంగాల కోసం టాటా టెక్నాలజీస్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. గ్లోబల్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ & డిజిటల్ సర్వీసెస్ కంపెనీగా యాక్ట్ చేస్తుంది. కస్టమర్ కంపెనీల కోసం మెరుగైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి డిజిటల్ టెక్నాలజీని, సాంప్రదాయ ఇంజినీరింగ్ కలుపుతూ పని చేస్తుంది.
డిసెంబరు 2022తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి, రూ. 3,011.8 కోట్ల ఆదాయాన్ని ఈ కంపెనీ నివేదించింది. ఏడాది ప్రాతిపదికన ఇది 15.5% వృద్ధి. ఈ తొమ్మిది నెలల కాలంలో కంపెనీ లాభం రూ. 407.5 కోట్లు.
2022 డిసెంబర్‌లో, శాటిలైట్ టీవీ ఆపరేటర్ అయిన టాటా ప్లే కూడా 'ప్రీ-ఫైల్డ్' DRHP లేదా కాన్ఫిడెన్షియల్ IPO పేపర్‌లను సెబీకి దాఖలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఐపీవో పేపర్లు దాఖలు చేసిన మొదటి సంస్థ ఇది. టాటా ప్లే కూడా త్వరలోనే IPO ప్రారంభించే యోచనలో ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.