TATA Tech IPO: ఎన్.చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాటా గ్రూప్‌, టాటా టెక్నాలజీస్‌ కంపెనీని (Tata Technologies Ltd) ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (IPO) ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది టాటా మోటార్స్‌ (TATA Motors) అనుబంధ సంస్థ.


IPO నిర్వహణ, సలహాల కోసం ఇప్పటికే రెండు సంస్థలను టాటా టెక్నాలజీస్‌ నియమించుకుంది, మరో కంపెనీని నియమించే ప్రక్రియలో ఉంది.


రూ.4,000 కోట్లు సమీకరించే ప్లాన్‌
IPO ద్వారా రూ.3,500-4,000 కోట్ల వరకు సేకరించాలని టాటా టెక్‌ భావిస్తోంది. తద్వారా కంపెనీ విలువను రూ. 16,200 కోట్లు– రూ. 20,000 కోట్లుగా ($2 బిలియన్ - 2.5 బిలియన్లు) లెక్కిస్తోంది. 


టాటా టెక్‌లో తనకున్న వాటాలో కొంత మొత్తాన్ని (partial divestment‌) పబ్లిక్‌ ఫ్లోట్‌లో విక్రయించేందుకు టాటా మోటార్స్ బోర్డు 2022 డిసెంబర్‌లో ఆమోదించింది.


"డిసెంబర్ 12, 2022న జరిగిన సమావేశంలో, టాటా మోటార్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా IPO కమిటీ ఏర్పాటైంది. మార్కెట్ పరిస్థితులు, వర్తించే అనుమతులు, రెగ్యులేటరీ క్లియరెన్స్‌లకు లోబడి అనుకూల సమయంలో IPO మార్గం ద్వారా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌లో పెట్టుబడిని టాటా మోటార్స్‌ పాక్షికంగా ఉపసంహరించుకుంటుంది" అని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో టాటా మోటార్స్ తెలిపింది. కానీ షెడ్యూల్ వివరాలను అందించలేదు.


కంపెనీ 2022 వార్షిక నివేదిక ప్రకారం.. టాటా టెక్నాలజీస్‌లో టాటా మోటార్స్‌కు 74.42% వాటా ఉంది. టాటా క్యాపిటల్ అడ్వైజర్స్ నిర్వహణలో సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న పెట్టుబడి సంస్థ Alpha TC Holdings Pte Ltdకు కూడా 8.96% వాటా ఉండగా, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్‌కు మరో 4.48% స్టేక్‌ ఉంది.


ఇతర చిన్న వాటాదార్లలో... టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్, టాటా ఎంటర్‌ప్రైజెస్ ఓవర్సీస్ లిమిటెడ్, రతన్ టాటా, కంపెనీ ఛైర్మన్ ఎస్.రామదొరై, ఇతరులు ఉన్నారు.


TCS తర్వాత ఇదే మొదటి IPO
టాటా టెక్నాలజీస్‌ IPOకు అన్ని అనుమతులు అందితే, 18 సంవత్సరాల తర్వాత వస్తున్న టాటా గ్రూప్ మొదటి IPO అవుతుంది. 2017 జనవరిలో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత గ్రూప్ చైర్మన్ N.చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో వచ్చే మొదటి IPOగానూ ఇది నిలుస్తుంది. దీంతో, మార్కెట్‌ కళ్లన్నీ ఈ కంపెనీ మీదే ఉన్నాయి. 


1989లో టాటా టెక్నాలజీస్‌ కంపెనీని స్థాపించారు. ఇంజినీరింగ్ డిజైన్, టెక్నాలజీ సేవల సంస్థ ఇది. ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ హెవీ మెషినరీ, ఇతర విభాగాల్లో వ్యాపారం చేస్తోంది. 


యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా-పసిఫిక్ మొత్తంలో కలిపి టాటా టెక్‌కు 9,300 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.


టాటా గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ, ఇండియన్‌ IT మేజర్ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS), టాటా గ్రూప్‌ నుంచి వచ్చిన చివరి IPO. 2004లో TCS పబ్లిక్‌లోకి వచ్చింది.


టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ టాటా ప్లే (TATA PLAY) కూడా IPO కోసం సిద్ధం అవుతోంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.