OYO IPO: సాఫ్ట్‌ బ్యాంక్ పెట్టుబడులు ఉన్న ఆతిథ్య రంగ కంపెనీ ఓయో (OYO), తన ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ‍‌(IPO) కోసం మళ్లీ సెబీ (SEBI) తలుపు తట్టబోతోంది. IPO కోసం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్‌ను (DRHP) స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యకాలం నాటికి రీఫైల్ చేయనున్నట్లు ప్రకటించింది.


ఓయో హోటల్స్‌ బ్రాండ్‌తో ట్రావెల్ & హోటల్ రంగంలో వ్యాపారం చేస్తున్న ఓయో మాతృ సంస్థ ఒరావేల్‌ స్టేస్‌ (Oravel Stays).


ఒరావేల్‌ స్టేస్‌ పబ్లిక్ లిస్టింగ్ అప్లికేషన్‌ను 2023 జనవరి ప్రారంభంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తిప్పి పంపింది. బిజినెస్‌ అప్‌డేట్స్‌, రివిజన్స్‌తో రీఫైల్ చేయమని ముందుగా కోరింది. రిస్క్ ఫాక్టర్లు, కొనసాగుతున్న కోర్ట్‌ కేసు, ఆఫర్‌కు ప్రాతిపదిక ఏంటి అనే అంశాలను కూడా కొత్త అప్లికేషన్‌లో పేర్కొనాలను సూచించింది. రీఫైలింగ్‌కు మరో 2-3 నెలల సమయం పట్టవచ్చని ఓయో కంపెనీ అప్పట్లో తెలిపింది.


ఏప్రిల్‌లోగా సెబీ నుంచి ఆమోదం?
కొత్త డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన తర్వాత, ఏప్రిల్‌లోగా సెబీ నుంచి ఆమోదం పొందవచ్చని ఈ కంపెనీ భావిస్తోంది.


గురుగావ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ యునికార్న్ కంపెనీని IPOకు తీసుకురావడానికి, 2021 సెప్టెంబర్‌లోనే SEBIకి డ్రాఫ్ట్ పేపర్లను Oravel Stays దాఖలు చేసింది. IPO ద్వారా రూ. 8,430 కోట్లు ($1.2 బిలియన్) సమీకరించాలని ఆ కంపెనీ భావించింది. ఇందులో, తాజా ఇష్యూ ద్వారా రూ. 7,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ‍‌(OFS) ద్వారా మిగిలిన రూ.1,430 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా, $11-12 బిలియన్ల మార్కెట్‌ విలువ కోసం ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది.


ఓయో లాభనష్టాలు
2022-23 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) సంబంధించిన ఆర్థిక ఫలితాలను DRHP రూపంలో సెబీకి ఓయో సమర్పించింది. FY23 తొలి అర్ధభాగంలో రూ. 63 కోట్ల లాభం వచ్చినట్లు ఆ పేపర్లలో ఓయో హోటల్స్‌ పేర్కొంది. క్రితం ఏడాది ఇదే సమయంలో రూ. 280 కోట్ల నష్టం వచ్చిందని నివేదించింది. FY23 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో కంపెనీ ఆదాయం 24% పెరిగి రూ. 2,905 కోట్లుగా నమోదైందని ప్రకటించింది. FY23 మొదటి 6 నెలల్లో హోటల్స్‌ నెలవారీ బుకింగ్ విలువ (GBV per month) 69 శాతం పెరిగింది. కంపెనీ వద్ద రూ. 2,785 కోట్ల నగదు నిల్వలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సమాచారాన్ని కూడా అప్‌డేట్ చేయమని మార్కెట్‌ రెగ్యులేటర్‌ ఓయోను కోరింది.


కొత్త సంవత్సరంలో రికార్డ్‌ బుకింగ్స్‌
కొత్త సంవత్సరంలో (2023) కంపెనీ వ్యాపారం అద్భుతంగా ప్రారంభమైంది. ఓయో వ్యవస్థాపకుడు & గ్రూప్ CEO రితేష్ అగర్వాల్ షేర్‌ చేసిన సమాచారం ప్రకారం... కొత్త సంవత్సరం సందర్భంగా, ఓయో యాప్‌ ద్వారా 4.5 లక్షలకు పైగా రూమ్‌ బుకింగ్స్‌ జరిగాయి. ఇది కంపెనీ చరిత్రలోనే రికార్డ్‌. గత సంవత్సరం కంటే 35 శాతం ఎక్కువ. వీటిలో, గరిష్ట బుకింగ్స్‌ వారణాసి నుంచి వచ్చాయి.