Adani Enterprises FPO: అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO: అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ, మల్టీ బ్యాగర్ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతి పెద్ద ఫాలో-ఆన్ పబ్లిక్‌ ఆఫర్ (Follow-on Public Offer -FPO) ప్రారంభించబోతోంది. FPO ద్వారా రూ. 20,000 కోట్లు సమీకరించబోతోంది. దీని కోసం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఆఫర్‌ లెటర్‌ సమర్పించింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO పూర్తి వివరాలు


జనవరి 27, 2023న అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO ఓపెన్‌ అవుతుంది. పెట్టుబడిదారులు 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


FPO ప్రైస్‌ బ్యాండ్‌ను కూడా ఈ కంపెనీ ప్రకటించింది. ఒక్కో షేరు ధర రూ. 3112 నుంచి రూ. 3276 గా నిర్ణయించింది. BSEలో బుధవారం (18 జనవరి 2023) నాటి ముగింపు ధర అయిన రూ. 3,595.35 కంటే 10-15 శాతం తక్కువకే షేర్లను ఈ కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.


FPOలో 35 శాతం కోటాను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ రిజర్వ్ చేసింది.


రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రత్యేక డిస్కౌంట్‌ రేట్‌కు షేర్లను జారీ చేస్తోంది. ఒక్కో షేరు మీద రూ. 64 ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నారు.


యాంకర్ ఇన్వెస్టర్లు FPO ప్రారంభానికి రెండు రోజుల ముందు, అంటే జనవరి 25, 2023న అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPOలో దరఖాస్తు చేసుకుంటారు. 


FPO ద్వారా పాక్షిక చెల్లింపు ప్రాతిపదికన షేర్లను (Fully Paid Shares) అదానీ ఎంటర్‌ప్రైజెస్ జారీ చేస్తుంది. 


FPOలో వాటాలు పొందిన రిటైల్ పెట్టుబడిదారులను రెండు లేదా మూడు వాయిదాల్లో పూర్తి మొత్తాన్ని చెల్లించమని అదానీ ఎంటర్‌ప్రైజెస్ కోరవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూలోనూ ఇదే జరిగింది. 


FPO ద్వారా ఈ కంపెనీ మార్కెట్ నుంచి రూ. 20,000 కోట్లను సమీకరించబోతోంది. 


FPO ద్వారా సమీకరించిన మొత్తంలో రూ. 4170 కోట్లను రుణం చెల్లించేందుకు వినియోగించనుంది. కంపెనీ విస్తరణ ప్రణాళిక కోసం మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. 


అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO తర్వాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 3.5 శాతం తగ్గుతుంది. సెప్టెంబర్ 2022 డేటా ప్రకారం, కంపెనీలో ప్రమోటర్ల వాటా 72.63 శాతం. LICకి 4.03 శాతం వాటా ఉంది. ఇది కాకుండా, నోమురా సింగపూర్, APMS ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్‌లు కంపెనీలో దాదాపు 1 నుంచి 2 శాతం వాటా కలిగి ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో-ఆన్ ఆఫర్‌లో అంతర్జాతీయ పెట్టుబడి కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నాయి.


ఇటీవలి సంవత్సరాలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్‌లోని అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటి, పెట్టుబడిదారులకు 16 రెట్లు రాబడిని ఇచ్చింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.