Tamilanadu Mercantile Bank IPO: తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ IPO సోమవారం ప్రారంభమవుతుంది: మన దేశంలో వందేళ్ల క్రితం ప్రారంభమైన ప్రైవేట్ రంగ బ్యాంక్‌ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB), ఐపీవోకు (IPO)కు వస్తోంది. దాదాపు మూడు నెలల స్తబ్దత తర్వాత, ఈ మూడు వారాల్లో మార్కెట్‌లోకి వస్తున్న మూడో ఐపీవో ఇది. ఇంతకుముందు వచ్చిన సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ, డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ ఐపీవోలకు పెట్టుబడిదారుల నుంచి బలమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు వస్తున్న తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంకుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం:


సబ్‌స్క్రిప్షన్ తేదీలు లేదా ఐపీవో తేదీలు:
టీఎన్‌బీ ఐపీవో ఈ నెల 5న (సోమవారం) స్ట్రీట్‌లోకి వస్తుంది, 7న ముగుస్తుంది.


ప్రైస్ బ్యాండ్‌:
IPO కోసం ఒక్కో షేరుకు రూ.500 - 525 ధరను తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంక్ నిర్ణయించింది. ఇవన్నీ పూర్తిగా తాజా షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) లేదు. అంటే, ఐపీవో ద్వారా వచ్చే ప్రతి రూపాయి కంపెనీకే వెళ్తుంది. ప్రమోటర్లు గానీ, ప్రస్తుతం ఉన్న షేర్‌హోల్డర్లు గానీ ఒక్క వాటాను కూడా అమ్మకానికి పెట్టడం లేదు.


లాట్‌ సైజ్‌: 
ఒక్కో లాట్‌కు 28 షేర్లు ఉంటాయి. బిడ్‌ వేయాలనుకున్నవాళ్లు 28 చొప్పున షేర్లకు బిడ్లు వేయాలి. దీని విలువ రూ.14,000 - 14,700.


ఆర్థిక పరిస్థితి:
యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం... తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నికర లాభం 2020 మార్చి - 2022 మార్చి మధ్య దాదాపు 42 శాతం CAGR వద్ద పెరిగింది. ఈ కాలంలో, 7.9 శాతం పీర్ మీడియన్‌తో పోలిస్తే, ఈ బ్యాంక్‌ డిపాజిట్లు 10.5 శాతం CAGR వద్ద పెరిగాయి. అడ్వాన్సులు 9.9 శాతం పెరిగాయి.


నేటి జీఎంపీ (గ్రే మార్కెట్‌ ప్రీమియం - శుక్రవారం):
మార్కెట్ ఎనలిస్టుల లెక్కల ప్రకారం.. ఇవాళ గ్రే మార్కెట్‌లో రూ.31 ప్రీమియం వద్ద షేర్లు అందుబాటులో ఉన్నాయి.


కంపెనీ గురించి:
1921లో నాడార్ బ్యాంక్‌గా దీనిని స్థాపించారు. 101 సంవత్సరాల చరిత్ర ఉన్న బ్యాంక్‌ ఇంది. ప్రాథమికంగా.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయ, రిటైల్ కస్టమర్లకు సేవలను అందిస్తోంది. ఈ బ్యాంకుకు దేశంలని వివిధ ప్రాంతాల్లో 509 శాఖలు ఉన్నాయి. వాటిలో... 369 సొంత రాష్ట్రమైన తమిళనాడులో ఉన్నాయి. ఈ 369 శాఖల నుంచే 70 శాతం వ్యాపారం చేస్తోంది. 15 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మిగిలిన శాఖలు ఉన్నాయి.


బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్:
కంపెనీ షేర్లు ఈ నెల 15 గురువారం రోజున రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (BSE, NSE‌) లిస్ట్ అవుతాయని భావిస్తున్నారు. 


వాల్యుయేషన్‌:
ప్రైస్‌ బ్యాండ్‌ అప్పర్‌ రేంజ్‌ ప్రకారం... తమిళనాడు మర్కంటైల్ ఐపీవో విలువను, దాని పోస్ట్‌ ఐపీవో బుక్‌ వాల్యూకు 1.35 రెట్ల వద్ద నిర్ణయించారు. 


ఐపీవోలో పాల్గొనాలా?:
బ్యాంక్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం, విశ్వసనీయ కస్టమర్ బేస్, సేవలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం, తమిళనాడులో బలమైన ఉనికి, స్థిరంగా పెరుగుతున్న డిపాజిట్ బేస్ కారణంగా ఈ ఇష్యూను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని అజ్‌కాన్‌ గ్లోబల్‌ (Ajcon Global) సిఫార్సు చేస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.