Syrma SGS Technology IPO Listing: సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ లిస్టింగ్‌ అత్యంత విజయవంతమైంది. శుక్రవారం ఈ కంపెనీ 19 శాతం ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసింది. ఇష్యూ ధర రూ.220తో పోలిస్తే బీఎస్‌ఈలో రూ.262, ఎన్‌ఎస్‌ఈలో రూ.260 వద్ద నమోదైంది. గత మూడు నెలల తర్వాత ఐపీవోకు వచ్చిన తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం.


ఇష్యూకు అనూహ్య స్పందన


ఆరు నెలలకు పైగా ఒడుదొడుకులకు లోనైన స్టాక్‌ మార్కెట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. మరోవైపు కంపెనీ గణాంకాలు బాగుండటం, ఎక్కువ మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడంతో సిర్మా షేర్ల ప్రీమియం పెరిగింది. ఆగస్టు 12-18 వరకు సబ్‌స్క్రైబ్‌ చేసుకొనేందుకు అవకాశం ఇవ్వగా 32.61 రెట్లు ఎక్కువగా స్పందన లభించింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు అయితే ఏకంగా 87.56 రెట్లు దరఖాస్తు చేసుకున్నారు. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు సైతం 17.5 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు 5.53 రెట్లు బుక్‌ చేసుకున్నారు. ఈ ఐపీవో ద్వారా సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ రూ.840 కోట్లు సమీకరించింది. వీటిలో రూ.766 కోట్లను కంపెనీ విస్తరణ, మూలధనం, ఇతర కార్పొరేట్‌ వ్యవహారాలకు వినియోగించనుంది.


గ్రే మార్కెట్లోనూ హవా


సిర్మా టెక్నాలజీస్‌ ఇష్యూకు గ్రే మార్కెట్లోనూ మెరుగైన స్పందనే లభించింది. గత గురువారం ఒక్కో షేరుకు రూ.36 ప్రీమియం ఉండగా శుక్రవారం రూ.12 పెరిగి రూ.48కి చేరుకుంది. సాధారణంగా గ్రే మార్కెట్‌ ప్రీమియం (GMP) ఎక్కువగా ఉంటే లిస్టింగ్‌ రోజు అధిక ప్రీమియంతో షేర్లు నమోదవుతాయి. మొదట్లో సిర్మా జీఎంపీ రూ.20గా ఉండేది. ఆ తర్వాత రూ.48కి పెరిగింది. సిర్మా షేరు ప్రైస్‌ బ్యాండ్‌ రూ.209- రూ.220గా ఉంది. గరిష్ఠ ధర ప్రకారం రూ.220+48 మొత్తంగా రూ.268కి షేర్లు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు. అన్నట్టే జరిగింది.


బడా కస్టమర్లు


ఎలక్ట్రానిక్‌ రీసెర్చ్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌లో సిర్మా టెక్నాలజీస్‌కు మంచి అనుభవం ఉంది. టీవీఎస్‌ మోటార్స్‌, ఏవో స్మిత్‌ ఇండియా, రాబర్ట్‌ బాష్‌ ఇంజినీరింగ్‌, యురేకా ఫోర్బ్స్‌, టాటా పవర్, టోటల్‌ పవర్‌ యూరప్‌ వంటి కంపెనీలు వీరికి కస్టమర్లు. హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో తయారీ కేంద్రాలు ఉన్నాయి. తమిళనాడు, హరియాణా, జర్మనీలో ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు ఉన్నాయి.