Tata Sons Listing: టాటా సన్స్ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (Tata Sons IPO) కోసం ఎదురుచూస్తున్న పెట్టుబడిదార్లకు ఒక షాకింగ్‌ న్యూస్‌. పబ్లిక్‌లోకి రాకుండా ఎలాగైనా తప్పించుకోవడానికి ఈ టాటా గ్రూప్‌ (Tata Group) మాతృ సంస్థ దారులు వెదుకుతోందని సమాచారం.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFCs) కోసం 2021 అక్టోబర్‌లో కొత్త నిబంధనలు జారీ చేసింది. ఆ రూల్స్‌ ప్రకారం, పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు 3 సంవత్సరాల లోపు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ కావాలి. ఈ నిబంధనలను అనుసరించి, టాటా సన్స్ కూడా వచ్చే ఏడాది (2025) సెప్టెంబర్ నాటికి స్టాక్ మార్కెట్‌లో నమోదు కావాలి. అయితే, ఈ లిస్టింగ్‌ను ఎలాగైనా తప్పించుకోవాలని టాటా సన్స్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం, లిస్టింగ్‌ను వాయిదా వేసే ప్రత్యేక అనుమతి కోసం ఆర్‌బీఐని ఆశ్రయించింది. వాయిదా అడగడం కోసం, తన రుణంలో ఎక్కువ భాగాన్ని టాటా సన్స్ తిరిగి చెల్లించినట్లు RBIకి తెలిపింది.


అప్పర్‌ లేయర్ కేటగిరీలో టాటా సన్స్ 
2018లో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ (IL&FS) కుప్పకూలిన తర్వాత, NBFCల నియంత్రణ నిబంధనలను కేంద్ర బ్యాంక్‌ కఠినంగా మార్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, NBFCల ను బేస్ లేయర్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్, టాప్ లేయర్‌గా విభజించింది. టాటా సన్స్ అప్పర్‌ లేయర్ కేటగిరీలోకి వచ్చింది. ఈ కేటగిరీ ఎన్‌బీఎఫ్‌సీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావడానికి ఆర్‌బీఐ 3 సంవత్సరాల సమయం ఇచ్చింది. ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, టాటా సన్స్‌కు ఆర్‌బీఐ నుంచి ఉపశమనం పొందకపోతే, అది భారతీయ స్టాక్ మార్కెట్‌లో అతి పెద్ద IPO అవుతుంది.


ఇంతకుముందు కూడా, పబ్లిక్‌ ఆఫర్‌ నుంచి తప్పించుకోవడానికి టాటా సన్స్ అనేక మార్గాలను అనుసరించింది. తన బ్యాలెన్స్ షీట్‌ను పునర్నిర్మిస్తోంది. టాటా క్యాపిటల్ నుంచి విడిపోవడం లేదా కంపెనీని రుణ రహితంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కంపెనీ మొత్తం అప్పు రూ. 20 వేల కోట్లకు పైగా ఉంది. టాటా సన్స్ ఆదాయం కూడా రూ. 35,058 కోట్లకు పెరిగింది. లాభం కూడా క్రితం ఏడాదితో పోలిస్తే రూ.22,132.38 కోట్లకు పెరిగింది.


టాప్ 10 NBFCల్లో నాలుగో స్థానం
రతన్ టాటా నేతృత్వంలోని టాటా ట్రస్ట్‌కు టాటా సన్స్‌లో 66 శాతం వాటా ఉంది. పల్లోంజీ మిస్త్రీ గ్రూప్‌నకు 18.4 శాతం స్టేక్‌ ఉంది. పల్లోంజీ మిస్త్రీ గ్రూప్ వాటా విలువ ప్రస్తుతం దాదాపు రూ. 1,98,000 కోట్లుగా అంచనా. RBI టాప్ 10 NBFCల్లో టాటా సన్స్ నాలుగో స్థానంలో ఉంది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, టాటా సన్స్ ఐపీవో వస్తే, ఆ కంపెనీ విలువ రూ. 8 లక్షల కోట్లు అవుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్‌ కోసం అప్లై చేయడం ఇప్పుడు ఈజీ, బ్యాంక్‌ ఆ పనిని సింపుల్‌గా మార్చింది