Radiant Cash Management IPO: హమ్మయ్య, చాలాకాలం తర్వాత ఒక IPO లిస్టింగ్‌ గురించి చల్లని కబురు విన్నాం. ఇవాళ (బుధవారం, 04 జనవరి 2023) స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టిన రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు, మంచి ధర వద్ద లిస్ట్ అయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌, NSEలో రూ. 103 వద్ద ఒక్కో షేరు ప్రారంభమైంది. IPO ఇష్యూ ధర రూ. 94తో పోలిస్తే ఇది 9.57% ప్రీమియం. అదే సమయంలో, బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌, BSEలో ఈ స్టాక్‌ 5.64% ప్రీమియంతో రూ. 99.30 వద్ద ఓపెన్‌ అయింది.


స్టాక్‌ మార్కెట్లలో లిస్టింగ్‌కు ముందు, అనధికారిక లేదా గ్రే మార్కెట్‌లో (grey market), ఇష్యూ ధర కంటే కొద్దిగా ఎక్కువ ప్రీమియంతో షేర్లు ట్రేడయ్యాయి. అదే ట్రెండ్‌ లిస్టింగ్‌లోనూ కొనసాగింది.


రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ IPO వివరాలు
రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ IPO 2022 డిసెంబర్ 23న ప్రారంభమైంది, డిసెంబర్ 27న ముగిసింది. IPO ధరను ఒక్కో షేరుకు రూ. 94 - 99 మధ్య నిర్ణయించింది. రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం, పెట్టుబడిదారులు లాట్ల రూపంలో దరఖాస్తు చేశారు, ఒక్కో లాట్‌కు 150 షేర్లను కంపెనీ కేటాయించింది. 


IPO ద్వారా దాదాపు రూ. 388 కోట్లను కంపెనీ సమీకరించింది. ఈ ఆఫర్‌లో, రూ. 60 కోట్ల విలువైన ప్రైమరీ (ఫ్రెష్‌) షేర్లను కంపెనీ ఇష్యూ చేసింది. మిగిలిన భాగం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (Offer For Sale - OFS) వాటా. 


ఈ IPOలో... అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు (Qualified Institutional Buyers -QIBలు) 50 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (Non Institutional Investors - NIIలు) 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు (Retail Individual Investors - RIIలు) 35 శాతం కోటా కేటాయించారు. సంస్థాగత కొనుగోలుదార్ల కోటా పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. అయితే సంస్థాగతేతర పెట్టుబడిదార్ల భాగం 66 శాతం, రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల కోటా కేవలం 20 శాతం సబ్‌స్క్రిప్షన్ దక్కించుకుంది. 


నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSE డేటా ప్రకారం... 2,74,29,925 షేర్లను ఇనీషియల్‌ షేర్‌ సేల్‌ ఆఫర్‌ కోసం ఈ కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొస్తే... 1,45,98,150 షేర్ల కోసం మాత్రమే ఇన్వెస్టర్లు బిడ్స్‌ వేశారు.


కంపెనీ వ్యాపారం
రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ భారతదేశంలోని నగదు నిర్వహణ సేవల పరిశ్రమలో ఒక భాగం. రిటైల్ క్యాష్ మేనేజ్‌మెంట్ (RCM) విభాగంలో ప్రముఖంగా పని చేస్తోంది. నెట్‌వర్క్ పరంగా RCM విభాగంలో అతి పెద్ద కంపెనీల్లో ఇది ఒకటి. భారతదేశంలోని 13,044 పిన్ కోడ్‌లలో రేడియంట్‌ సేవలు అందిస్తోంది. లక్షద్వీప్ మినహా దేశంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తోంది. జులై 31, 2022 నాటికి 5,388కు పైగా ప్రాంతాల్లో దాదాపు 55,513 టచ్‌ పాయింట్‌ సేవలు అందిస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.