Oyo IPO Papers Returned: ఓయో హోటల్స్ బ్రాండ్‌తో ట్రావెల్ & హోటల్ రంగంలో వ్యాపారం చేస్తున్న ఒరావేల్ స్టేస్ (Oravel Stays) సమర్పించిన IPO పేపర్లు తిరిగి సొంత గూటికి చేరాయి. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కోసం, ఓయో మాతృసంస్థ Oravel Stays దాఖలు చేసిన IPO ముసాయిదా పత్రాన్ని (Draft Red Herring Prospectus - DRHP), మార్కెట్ రెగ్యులేటింగ్ అథారిటీ సెబీ (SEBI) తిప్పి పంపింది. కొన్ని మార్పులు చేసి, రీ-ఐపీఓ కోసం డ్రాఫ్ట్ పేపర్‌ను మళ్లీ ఫైల్ చేయమని సూచించింది.
2022 డిసెంబర్ 30న Oravel Stays IPO డ్రాఫ్ట్ పేపర్లను సెబీ తిప్పి పంపింది. అయితే.. ఎలాంటి అదనపు సమాచారాన్ని సెబీ అడిగింది అన్న విషయాన్ని ఇటు Oravel Stays గానీ, అటు సెబీ గానీ వెల్లడించలేదు.
IPO మరింత ఆలస్యం
IPO ద్వారా నిధులు సమీకరించాలని ఓయో హోటల్స్ చాలా కాలంగా భావిస్తూ వచ్చింది. 2022లో న్యూ-ఏజ్ టెక్ కంపెనీల పరిస్థితి బాగోలేకపోవడంతో, అప్పట్లో వెనుకంజ వేసింది. 2023 ప్రారంభంలో IPOని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. తాజా పరిణామంతో, ఈ IPO మరింత ఆలస్యం కావచ్చు.
గురుగావ్ కేంద్రంగా పనిచేస్తున్న యునికార్న్ కంపెనీ అయిన ఓయోను IPOకు తీసుకురావడానికి, 2021 సెప్టెంబర్‌లోనే SEBIకి డ్రాఫ్ట్ పేపర్లను Oravel Stays దాఖలు చేసింది. IPO ద్వారా రూ. 8,430 కోట్లు సమీకరించాలని ఆ కంపెనీ భావించింది. ఇందులో, తాజా ఇష్యూ ద్వారా రూ. 7,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా మిగిలిన రూ.1,430 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2022-23 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు (ఏప్రిల్-సెప్టెంబర్) సంబంధించిన ఆర్థిక ఫలితాలను DRHP రూపంలో సెబీకి ఓయో సమర్పించింది. FY23 తొలి అర్ధభాగంలో రూ. 63 కోట్ల లాభం వచ్చినట్లు ఆ పేపర్లలో ఓయో హోటల్స్ పేర్కొంది. క్రితం ఏడాది ఇదే సమయంలో రూ. 280 కోట్ల నష్టం వచ్చిందని నివేదించింది. FY23 ఏప్రిల్- సెప్టెంబర్ కాలంలో కంపెనీ ఆదాయం 24% పెరిగి రూ. 2,905 కోట్లుగా నమోదైందని ప్రకటించింది. కంపెనీ వద్ద రూ. 2,785 కోట్ల నగదు నిల్వలు కూడా ఉన్నాయి.
కొత్త సంవత్సరంలో రికార్డ్ బుకింగ్స్
కొత్త సంవత్సరంలో (2023) కంపెనీ వ్యాపారం అద్భుతంగా ప్రారంభమైంది. ఓయో వ్యవస్థాపకుడు & గ్రూప్ CEO రితేష్ అగర్వాల్ పంచుకున్న సమాచారం ప్రకారం... కొత్త సంవత్సరం సందర్భంగా, ఓయో ద్వారా 4.5 లక్షలకు పైగా రూమ్స్ బుకింగ్‌లు జరిగాయి. ఇది కంపెనీ చరిత్రలోనే రికార్డ్. గత సంవత్సరం కంటే 35 శాతం ఎక్కువ. వీటిలో, గరిష్ట బుకింగ్స్ వారణాసి నుంచి వచ్చాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.