NSDL IPO: 


నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (NSDL) అతి త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) డ్రాఫ్ట్‌ పేపర్లను సమర్పించింది. ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (NSDL IPO) మొత్తం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) విధానంలో జరుగుతుందని తెలిసింది. మొత్తం 5.72 కోట్ల షేర్లను షేరు హోల్డర్లు విక్రయించనున్నారు.


ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఐడీబీఐ బ్యాంకు 2.22 కోట్లు, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజీ 1.80 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా 56.25 లక్షలు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా 40 లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 40 లక్షల షేర్లను విక్రయించనున్నాయి. ఎస్‌యూయూఐటీ 34.15 లక్షల షేర్లను అమ్మనుంది. కంపెనీ షేర్లు బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజీ (BSE)లో నమోదవుతాయని డ్రాఫ్ట్‌ పేపర్ల ద్వారా తెలిసింది.


ఐపీవోలో కొంత భాగం అర్హత పొందిన ఉద్యోగులకు కేటాయించారు. ఇష్యూ ధరతో పోలిస్తే కొంత రాయితీ ఇస్తారని తెలిసింది. 2023 ఆర్థిక ఏడాదిలో ఎన్‌ఎస్‌డీఎల్‌ రూ.1,099 కోట్ల రాబడి నమోదు చేసింది. నికర లాభం రూ.234.81 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇదెంతో ఎక్కువ కావడం గమనార్హం. మన దేశంలోని సెక్యూరిటీ, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో ఎన్‌ఎస్‌డీఎల్‌ చాలా ఉత్పత్తులు, సేవల్ని విక్రయిస్తోంది.


డిపాజిటరీ చట్టం 1996ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఎన్‌ఎస్‌డీఎల్‌ డీమ్యాట్ సేవల్ని అందిస్తోంది. 2023, మార్చి 31 నాటికి ఇష్యూ చేసిన సంఖ్య, యాక్టివ్‌ ఇన్స్‌ట్రూమెంట్స్‌లో ఎన్‌ఎస్‌డీఎల్‌ అగ్రగామిగా ఉంది. కస్టడీలోని ఆస్తుల విలువ, డీమ్యాట్‌ సెటిల్‌మెంట్లలోని విలువ పరంగా మార్కెట్లోనే నంబర్‌ వన్‌ పొజిషన్లో కొనసాగుతోంది.


ఎన్‌ఎస్‌డీఎల్‌ ఇష్యూకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్‌స్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌, ఎస్బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఉన్నాయి.


Also Read: TDS కట్‌ కాని పోస్టాఫీస్‌ స్కీమ్స్‌ కొన్ని ఉన్నాయి, ఫుల్‌ అమౌంట్‌ మీ చేతికొస్తుంది


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial