Ideaforge Listing: 


మానవ రహిత డ్రోన్ల తయారీ కంపెనీ ఐడియా ఫోర్జ్‌ లిస్టింగ్‌ సూపర్‌ డూపర్‌ హిట్టైంది! అందరి అంచనాలను మించుతూ అధిక ప్రీమియానికే షేర్లు నమోదయ్యయాయి. ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 94 శాతం ప్రీమియంతో నమోదవ్వడంతో ఇన్వెస్టర్లు మస్తు ఖుషీ అవుతున్నారు. 2023లో ఇప్పటి వరకు ఇంత సక్సెస్‌ఫుల్‌ ఐపీవో లేకపోవడం విశేషం.


ఇష్యూ ధర రూ.672తో పోలిస్తే ఐడియా ఫోర్జ్‌ (Ideaforge) షేర్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ (NSE)లో రూ.1300, బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1305కు లిస్టయ్యాయి. చాలామంది అనలిస్టులు 50-75 శాతం ప్రీమియంతో నమోదవుతాయని అంచనా వేయగా ఏకంగా 94 శాతానికి అవ్వడం గమనార్హం. పబ్లిక్ ఇష్యూకు మెరుగైన స్పందన రావడం, ఫస్ట్‌ మూవర్‌ అడ్వాడేంజీ ఉండటం, డిఫెన్స్‌ ఇండస్ట్రీ ఔట్‌లుక్‌ బాగుండటం, స్థానిక డ్రోన్‌ మార్కెట్లో 50 శాతం వాటా ఉండటంతో ఐడియాఫోర్జ్‌ (Ideaforge Shares) షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. గ్రే మార్కెట్లోనే 75 శాతం ప్రీమియంతో షేర్లు ట్రేడవ్వడం విశేషం.


ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ప్రతి రోజూ రికార్డులు సృష్టిస్తున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సైతం భారీగా డాలర్లను వెదజల్లుతున్నారు. మార్చి నెల కనిష్ఠంతో పోలిస్తే సెన్సెక్స్‌ 15 శాతం, నిఫ్టీ 16 శాతం మేర రాణించాయి. ఇవన్నీ ఐడియాఫోర్జ్‌ ఐపీవోపై (Ideaforge IPO) సానుకూల ప్రభావం చూపించాయి.


ఐడియా ఫోర్జ్‌ పబ్లిక్ ఇష్యూకు 106.6 రెట్ల స్పందన లభించింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు కేటాయించిన కోటా కన్నా 125.81 రెట్లు అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు 85.20 రెట్లు, సంపన్నులు 80.58 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు.


ఐడియా ఫోర్జ్‌ మెరుగ్గా లిస్టవుతుందని మెహతా ఈక్విటీ రీసెర్చ్‌ అనలిస్టు ప్రశాంత్‌ తాప్సె ముందుగానే అంచనా వేశారు. మానవ రహిత డ్రోన్‌ లేదా డ్రోన్‌ మార్కెట్లో పెద్ద కంపెనీల్లో ఒకటైన ఐడియాఫోర్జ్‌లో పెట్టుబడి పెడితే ఫస్ట్‌ మూవర్‌ అడ్వాంటేజీ లభిస్తుందని ఆయన అన్నారు. పైగా ఇండస్ట్రీ మున్ముందు మరింత రాణిస్తుందని తెలిపారు. కంపెనీ ఐపీవో ద్వారా రూ.567 కోట్లు సమీకరించిందన్నారు. తాజా ఇష్యూ కింద రూ.240 కోట్లు, ఆఫర్‌ఫర్‌ సేల్‌ కింద రూ.320 కోట్లు సేకరించిందని వెల్లడిచారు.


Also Read: రిలయన్స్‌ షేర్‌హోల్డర్లకు ఫ్రీ షేర్లు!, ఓకే చేసిన NCLT


2023, మే నాటికి ఐడియా ఫోర్జ్‌ 265 మంది వినియోగదారులకు సేవలు అందించింది. కేంద్ర పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, అటవీ శాఖ, స్మార్ట్‌ సిటీతో అనుబంధం ఉన్న ప్రైవేటు కాంట్రాక్టర్లకు డ్రోన్లను అందించింది. మార్చి నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.192.౩ కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్‌, క్వాల్‌కామ్‌ ఆసియా పసిఫిక్, సెలెస్టా క్యాపిటల్‌ 2 మారీషస్‌, సెలెస్టా క్యాపిటల్‌ 2బి మారీషస్‌, ఫ్లోరిన్‌ ట్రీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ, ఎగ్జిమ్‌ బ్యాంక్‌, ఇన్ఫినా ఫైనాన్స్‌ వంటి ఇన్వెస్టర్లు ఐడియాఫోర్జ్‌కు అండగా ఉన్నారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.