Ideaforge IPO: 


ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐడియాఫోర్జ్‌ ఐపీవో సోమవారమే మొదలవుతోంది. జూన్‌ 26 నుంచి 29 వరకు పబ్లిక్‌ నుంచి బిడ్లు ఆహ్వానిస్తున్నారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ రెండింట్లోనూ షేర్లు నమోదు అవ్వనున్నాయి. భారత్‌ డ్రోన్లు తయారు చేస్తున్న అతిపెద్ద కంపెనీ ఇదే కావడంతో మార్కెట్లో క్రేజ్‌ కనిపిస్తోంది. అందుకే ఐడియాఫోర్జ్‌ ఐపీవో విశేషాలు మీకోసం!


ఐడియాఫోర్జ్‌ వ్యాపారం ఏంటి?


మన దేశంలోని అతిపెద్ద డ్రోన్‌ తయారీ కంపెనీ ఐడియాఫోర్జ్‌! నిఘా, మ్యాపింగ్‌, సర్వేలకు అవసరమైన డ్రోన్లను తయారు చేసి విక్రయిస్తోంది. భారత సైన్యం, పారా మిలటరీ, సీఏపీఎఫ్‌, పోలీసులు వర్గాలు ఈ కంపెనీ వినియోగదారులు. ముంబయి కేంద్రం వ్యాపారం నిర్వహిస్తోంది. ఆయుధ రహిత డ్రోన్లు వీరి ప్రత్యేకత.  ఈ కంపెనీ తయారు చేసిన డ్రోన్లు నిఘా, మ్యాపింగ్‌ కోసం సగటున ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి గాల్లోకి ఎగురుతున్నాయి.


ఐడియాఫోర్జ్‌ ఉన్న ఇండస్ట్రీ ఎలా ఉంది?


అంతర్జాతీయంగా డ్రోన్ల వ్యాపారం 2022లో 21.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఏటా 20 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుందని అంచనా. 2027 నాటికి 51.4 బిలియన్‌ డాలర్లు, 2030కి 91.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 2022 నాటికి భారత్‌లో డ్రోన్ల వ్యాపారం విలువ 2.71 బిలియన్‌ డాలర్లుగా ఉంది.


ఐడియాఫోర్జ్‌ ఐపీవో పరిమాణం ఎంత?


ఐడియా ఫోర్జ్‌ రూ.240 కోట్ల విలువతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 48,69,712 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. అర్హులైన ఉద్యోగులకు ఐపీవోలో రిజర్వేషన్‌ ఉంటుంది. 


ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎవరెవరు షేర్లను విక్రయిస్తున్నారు?


ఆశీశ్‌ భట్‌ 1.58 లక్షల షేర్లు, అమర్‌ప్రీత్‌ సింగ్‌ 8,362 షేర్లు, నంబిరాజన్‌ శేషాద్రి 22,600 షేర్లను విక్రయిస్తున్నారు. ఏఈ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎల్‌ఎల్‌సీ, అగర్వాల్‌ ట్రేడ్‌మార్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సెలెస్టా క్యాపిటల్‌ 2 మారీషస్‌ వంటి వాటాదారులు మిగిలిన షేర్లను అమ్మేస్తున్నారు.


ఐడియాఫోర్జ్‌ ప్రైస్‌ బ్యాండ్‌ వివరాలు?


ఐడియాఫోర్జ్‌ ఐపీవో ధరల శ్రేణి రూ.638-672గా నిర్ణయించింది. ఇన్వెస్టర్లు కనీసం 22 షేర్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. ఎన్ని బిడ్లైనా వేసుకోవచ్చు. అప్పర్‌ బ్యాండ్‌ ప్రైస్‌ అయితే కంపెనీ రూ.567 కోట్లు సమీకరించగలదు. ఇష్యూలో 75 శాతం క్యూఐబీ, 15 శాతం ఎన్‌ఐఐ, 10 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. జేఎం ఫైనాన్షియల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఉన్నారు. లింక్‌ ఇన్‌ టైమ్‌ ఇండియా రిజిస్ట్రార్‌.


ఐడియాఫోర్జ్‌ ఆర్థిక ప్రదర్శన ఎలా ఉంది?


2023 ఆర్థిక ఏడాదిలో ఐడియాఫోర్జ్‌ ఆపరేషన్స్‌ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరిగి రూ.186 కోట్లుగా ఉంది. పన్నేతర ఆదాయం రూ.31.99 కోట్లుగా ఉంది.


ఐడియాఫోర్జ్‌ ఐపీవో ద్వారా సేకరించిన డబ్బు ఏం చేస్తారు?


ఐపీవో ద్వారా వచ్చిన డబ్బులో రూ.50 కోట్లను అప్పులు తీర్చేందుకు వాడుతారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ అంతరం పూడ్చేందుకు రూ.135 కోట్లు ఉపయోగిస్తారు. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, కార్పొరేట్‌ వ్యవహారాల కోసం రూ.40 కోట్లను కేటాయిస్తారు.


ఐడియాఫోర్జ్‌ వ్యాపారానికి రిస్క్‌లు ఏంటి?


డ్రోన్లు తయారీకి చాలా వస్తువులు అవసరం. వీటి కోసం కంపెనీ గ్లోబల్‌ వెండర్లపై ఆధారపడుతోంది. ఇప్పట్లో దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకొనే అవకాశం లేదు. డ్రోన్ల తయారీ వ్యాపారంపై నియంత్రణ ఎక్కువ. పాలసీల్లో తరచూ మార్పులు వస్తుంటాయి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial