భారతీయ జీవిత బీమా (LIC) ఐపీవోకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఇష్యూ మొదలైన రెండో రోజేకే దాదాపుగా అన్ని విభాగాల్లో సబ్‌స్క్రిప్షన్లు పూర్తయ్యాయి! కంపెనీ వాల్యుయేషన్‌ తగ్గించడం, ఎక్కువ డిస్కౌంట్‌ ఇస్తుండటంతో ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. మరో 4 రోజులు మిగిలుండగానే పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అవ్వడం గమనార్హం.


ఎల్‌ఐసీ ఇష్యూ మొదలై గురువారానికి రెండు రోజులే అయింది. 90 శాతం షేర్లకు ఇన్వెస్టర్లు ఆర్డర్‌ పెట్టేశారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన 35 శాతంలో 83 శాతం వరకు సబ్‌స్క్రైబ్‌ అయినట్లు మార్కెట్‌ డేటాను బట్టి తెలుస్తోంది. ఇక ఎల్‌ఐసీ పాలసీదారుల విభాగంలో డిమాండ్‌ రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంది. ఉద్యోగుల కోటాలోనూ రెండు రెట్లు డిమాండ్‌ కనిపించింది.


'ఎల్‌ఐసీ ఐపీవో ధరలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇష్యూ సైజ్‌, వాల్యుయేషన్‌ను తగ్గించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది' అని ఆర్బీఎస్ఏ అడ్వైజర్స్‌ సీఈవో రాజీవ్‌ షా అన్నారు. 'చూస్తుంటే రెండో రోజే ఎల్‌ఐసీ షేర్లు పూర్తిగా అమ్ముడైనట్టు ఉంది. ఇంతపెద్ద ఐపీఓకు ఇదో పెద్ద విజయమే అనాలి' అని ఇండిపెండెంట్‌ ఐపీవో అనలిస్టు ఆదిత్య కొండావర్‌ పేర్కొన్నారు. 'వాల్యూయేషన్‌ తగ్గించడం, పాలసీదారులకు డిస్కౌంట్లు ఇవ్వడం, షేర్ల ధర తక్కువగా పెట్టి ఐపీవోను ప్రభుత్వం విజయవంతం చేసింది' అని ఆయన వెల్లడించారు.


ఎల్ఐసీ వివరాలు


LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్‌ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.


సబ్‌స్క్రిప్షన్‌ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రైస్‌ బ్యాండ్‌ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్‌ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు  రూ.60, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.


ఆఫర్‌ వివరాలు: అప్పర్‌ బ్యాండ్‌ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.


ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు బిడ్‌ దాఖలు చేయొచ్చు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్‌ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.