LIC Share Price LIC Falls 20 Percent from IPO Price Know In Detail : భారతీయ జీవిత బీమా కంపెనీ (LIC shares) షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. మంగళవారం ఈ నష్టాలు మరింత పెరిగాయి. షేరు ధర జీవితకాల కనిష్ఠానికి పతనమైంది. మార్కెట్లో నమోదైన నాటి నుంచి 20 శాతం నష్టపోయింది. దాంతో ఇన్వెస్టర్లు లబోదిబోమని మొత్తుకుంటున్నారు.


ఎల్‌సీఐ రూ.949 ఇష్యూ ధరతో మార్కెట్లో నమోదైంది. ఆరంభమే 9 శాతం డిస్కౌంట్‌తో మొదలైంది. మంగళవారం ఉదయం రూ.772 వద్ద మొదలైన షేరు అదే స్థాయిలో ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. రూ.751 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి రూ.24 నష్టంతో 752 వద్ద ముగిసింది. అంటే ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే రూ.198 వరకు నష్టపోయింది. దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.5.70 లక్షల కోట్ల నుంచి రూ.4,76,683 కోట్లకు తగ్గిపోయింది.


కంపెనీ ఇష్యూకు వచ్చినప్పుడు చాలా వరకు బ్రోకింగ్‌  కంపెనీలు కొనుగోలు చేయొచ్చని రేటింగ్‌ ఇచ్చాయి. కొందరు అప్రమత్తంగా ఉంటూ హోల్డ్‌ చేయొచ్చని తెలిపారు. ఏదేమైనా షేరు ధరలో మూమెంటమ్‌ కనిపించడం లేదు. అయితే ఎక్కువ రిస్క్‌ తీసుకొనేవాళ్లు దీర్ఘకాలిక దృష్టితో షేర్లను హోల్డ్‌ చేయొచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. జీవిత బీమా రంగంలో తిరుగులేని కంపెనీ కావడం, మార్కెట్‌ వాటా ఎక్కువ ఉండటం, లాభాలు నమోదు చేస్తుండటం ఇందుకు కారణాలని వెల్లడించారు.


ఈ మధ్యే ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. 2021-22 ఆర్థిక ఏడాదిలో జనవరి-మార్చి క్వార్టర్లో రూ.2,371 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.2,893 కోట్లతో పోలిస్తే 18 శాతం తగ్గింది. అయితే 2021 ఏడాది చివరి క్వార్టర్‌ ఫలితాలు సంవత్సరం మొత్తాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి ఈ రెండు ఫలితాలను పోల్చొద్దని కంపెనీ వివరించింది.


'ఎల్‌ఐసీ Q4FY21లో రూ.2,893 కోట్ల లాభం ఆ సంవత్సరం మొత్తానికి చెందుతుంది. ఎందుకంటే అప్పటి వరకు కంపెనీ ఏడాదికోసారి మాత్రమే ఫలితాలను ప్రకటించేది. అందుకే ఇప్పటి ఫలితాలను అప్పటితో పోల్చడం సరికాదు. 2022లో కంపెనీ పన్నులు చెల్లించిన తర్వాత రూ.4,043 కోట్ల లాభం నమోదు చేసింది. గతేడాది రూ.2900 కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగింది. వచ్చే ఏడాది నుంచి త్రైమాసిక ఫలితాలను పోల్చేందుకు డేటా పాయింట్స్‌ దొరుకుతాయి' అని ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ అన్నారు.


2022 ఆర్థిక ఏడాదిలో ఎల్‌ఐసీ రూ.4,043 కోట్ల నికర లాభం నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన గతేడాది రూ.2900 కోట్ల లాభంతో పోలిస్తే 39.4 శాతం పెరిగింది. స్టాక్‌ మార్కెట్లో నమోదైన తర్వాత ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు కంపెనీ డివిడెండ్‌ను (LIC dividend) ప్రకటించింది. రూ.10 ఫేస్‌వాల్యూ కలిగిన ఒక్కో షేరుకు రూ.1.50 వరకు డివిడెండ్‌ ఇవ్వనుంది. ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.916 కోట్ల ఆదాయం వస్తుంది.