eMudhra IPO: డిజిటల్‌ సిగ్నేచర్‌ కంపెనీ ఈ-ముద్రా (e-Mudhra) బుధవారం స్టాక్‌ మార్కెట్లో నమోదైంది. భారీ అంచనాలతో పోలిస్తే స్వల్ప ప్రీమియంతోనే లిస్టైంది. రూ.256 ఇష్యూ ధరతో పోలిస్తే 6 శాతం ప్రీమియంతో బీఎస్‌ఈలో రూ271, ఎన్‌ఎస్‌ఈలో రూ.270 వద్ద ఆరంభమైంది.


ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లో లిస్టైన 15వ సంస్థగా ఈ-ముద్రా (e-Mudhra ipo) నిలిచింది. ఈ మధ్యే ఎల్‌ఐసీ, అదానీ విల్మర్‌, క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌, డెల్హీవరీ లిస్టింగుకు వచ్చాయి. మే 20-24 మధ్య ఐపీవోకు వచ్చిన  ఈ-ముద్రాకు ఇన్వెస్టర్ల మంచి స్పందనే వచ్చింది. ఇష్యూను 2.72 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు 4.05 రెట్లు, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 1.28 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు 2.61 రెట్లు బిడ్లు దాఖలు చేశారు.


'2022, 9 నెలల వార్షిక రాబడిని పరిగణనలోకి తీసుకుంటే ఇష్యూ ధర పీఈ (Price to earnings) 49 రెట్లుగా ఉంది. పన్నేతర ఆదాయం ప్రకారం చూస్తే 37, 34 పీఈతో లభిస్తోంది' అని ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. అయితే కంపెనీ రాబడి, భవిష్యత్తులో వృద్ధిరేటు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. దాంతో సుదీర్ఘకాలం ఈ షేర్లను పోర్టుపోలియోలో ఉంచుకోవడం ద్వారా లాభపడొచ్చని స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీలు అంటున్నాయి.




మొత్తంగా రూ.412 కోట్ల విలువతో ఈ-మద్రా ఇష్యూకు వచ్చింది ప్రెష్‌ ఇష్యూ సైజ్‌ను రూ.200 కోట్ల నుంచి రూ.161 కోట్లకు తగ్గించింది. ప్రి ఐపీవో ప్లేస్‌మెంట్‌ కింద రూ.39 కోట్ల విలువైన 16,03,617 షేర్లను అలాట్‌ చేసింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 98.35 లక్షల షేర్లు విక్రయించారు. ఈ ఇష్యూ ద్వారా సేకరించిన డబ్బును అప్పులు తీర్చేందుకు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, యంత్రాలు, భారత్‌, విదేశాల్లో ఏర్పాటు చేసిన డేటా సెంటర్ల ఖర్చులకు వినియోగించనున్నారు.
 
డిజిటల్‌ సిగ్నేచర్ సర్టిఫికెట్లు జారీ చేయడంలో ఈ-ముద్రా కంపెనీకి మంచి అనుభవం ఉంది. ఈ రంగంలో మైక్రోసాప్ట్‌, మొజిల్లా, యాపిల్‌, అడోబ్‌ వంటి కంపెనీలు గుర్తించిన ఏకైక భారత కంపెనీ ఇదే. దేశ వ్యాప్తంగా 88,457 ఛానెల్‌ పాట్నర్స్‌ ఉన్నారు. 2021, సెప్టెంబర్‌ 30 నాటికి 36,233 రిటైల్‌ కస్టమర్లు, 563 ఎంటర్‌ప్రైజెస్‌కు సేవలు అందించింది. 


2020-21లో ఆర్థిక ఏడాదిలో ఈ-ముద్రా 25.36 కోట్ల లాభం నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఇది రూ.18.41 కోట్లే కావడం గమనార్హం. గతేడాది రూ.116.8 కోట్లుగా ఉన్న రాబడి ఇప్పుడు రూ.132.45 కోట్లకు పెరిగింది.


యాంకర్‌ బుక్‌లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ ఎంఎఫ్‌, బారింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఇండియా, హార్న్‌బిల్‌ ఆర్చిడ్‌ ఇండియా ఫండ్‌, పైన్‌ బ్రిడ్జ్‌ ఇండియా ఈక్విటీ ఫండ్‌, అబాకస్‌ గ్రోత్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. ఐఐఎఫ్ఎల్‌ సెక్యూరిటీస్‌, యెస్‌ సెక్యూరిటీస్‌, ఇండోరీయెంట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లీడ్‌ మేనేజర్లుగా ఉన్నాయి. ఈ ఇష్యూకు లింక్‌ ఇన్‌టైమ్‌ ఇండియా రిజిస్ట్రార్‌.