IPOs Next Week: స్టాక్‌ మార్కెట్లు వచ్చేవారం బిజీగా ఉండనున్నాయి. రూ.2,387 కోట్ల విలువైన మూడు ఐపీవోలు సందడి చేయనున్నాయి. మే 17న ప్రదీప్‌ పాస్ఫేట్స్‌ (Pradeep Phosphates), బుధవారం 18న ఇథోస్‌ (Ethos), 20న ఈ ముద్రా (eMudhra) ఇష్యూకు వస్తున్నాయి.


ఫెర్టిలైజర్‌  కంపెనీ ప్రదీప్‌ పాస్ఫేట్స్‌ రూ.1502 కోట్లు ఐపీవో ద్వారా సమీకరించనుంది. ఇప్పటికే రూ.450 కోట్ల మేరకు గోల్డ్‌మన్‌ సాచెస్‌, బీఎన్‌పీ పారిబస్‌, అర్బిట్రేజ్‌, కుబేర్‌ ఇండియా ఫండ్‌, కాప్‌థాల్‌ మారిషస్‌ ఇన్వెస్ట్‌, సొసైటీ జనరల్‌ వంటి యాంకర్‌ ఇన్వెస్టర్ల ద్వారా సేకరించింది. ఫ్రెష్‌ ఇష్యూ కింద రూ.1004 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద రూ.11.85 కోట్ల విలువైన షేర్లు కేటాయించింది. జువారి మార్కో ఫాస్పేట్‌ 60,18,493, కేంద్ర ప్రభుత్వం 11,23,89,000 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ప్రైస్‌ బ్యాండ్‌ రూ.39-42గా నిర్ణయించారు.


ఇథోస్‌ రూ.472 కోట్ల విలువతో ఐపీవోకు వస్తోంది. ధరల శ్రేణిని రూ.836-878గా నిర్ణయించారు. రూ.375 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రెష్‌ ఇష్యూ కింద విక్రయిస్తున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 1,108,037 ఈక్విటీ షేర్లను కేటాయించారు. విలాసవంతమైన వాచ్‌లను తయారు చేయడంలో ఇథోస్‌కు మంచి పేరుంది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 17 నగరాల్లో 50 రిటైల్‌ స్టోర్లు ఉన్నాయి. వెబ్‌సైట్‌, సోషల్‌ మీడియా ద్వారా కస్టమర్లకు ఆమ్నీ చానెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తోంది. ఇథోస్‌ ఐపీవో పరిమాణంలో సగం వరకు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు మిగిలిన 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు.


డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికెట్స్‌ ప్రొవైడర్‌ ఈ-ముద్రా రూ.412 కోట్ల విలువతో ఐపీవోకు వస్తోంది. మే20 నుంచి 24 వరకు ఇష్యూ ఓపెన్‌ ఉంటుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లను మే 19న ఆహ్వానిస్తున్నారు. ఈ కంపెనీ ప్రెష్‌ ఇష్యూ సైజ్‌ను రూ.200 కోట్ల నుంచి రూ.161 కోట్లకు తగ్గించింది. ప్రి ఐపీవో ప్లేస్‌మెంట్‌ కింద రూ.39 కోట్ల విలువైన 16,03,617 షేర్లను అలాట్‌ చేస్తోంది. ఇక ఆఫర్‌ ఫర్‌ సేల్‌  కింద 98.35 లక్షల షేర్లు  అమ్ముతున్నారు. ఈ ఇష్యూ ద్వారా సేకరిస్తున్న డబ్బును అప్పులు తీర్చేందుకు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, యంత్రాలు, భారత్‌, విదేశాల్లో ఏర్పాటు చేసిన డేటా సెంటర్ల ఖర్చులకు వినియోగించనున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.