Retail Inflation Data February 2023: దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం అతి కొద్దిగా తగ్గింది. ఫిబ్రవరి 2023లో, వినియోగదారు ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారిత రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ ‍‌రేటు స్వల్ప ఉపశమనం ఇచ్చింది. అయితే, RBI టాలరెన్స్ బ్యాండ్ కంటే ఇది ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. 


2023 ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation) 6.44 శాతంగా నమోదైంది. 2023 జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉండగా, ఈ స్థాయి కంటే ఫిబ్రవరిలో కాస్త తగ్గింది. గత సంవత్సరం ఇదే కాలంలో (ఫిబ్రవరి 2022) రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా ఉంది. అంటే, ఏడాది క్రితం కంటే ఇప్పుడు ఎక్కువగానే ఉంది. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు స్వల్పంగా తగ్గడంతో, 2023 ఫిబ్రవరిలో చిల్లర ద్రవ్యోల్బణం కాస్త తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.


ధాన్యాలు & పాల ఉత్పత్పుల ధరలే సమస్యాత్మకం                                
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి గల కారణాలను పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో ఆహార ద్రవ్యోల్బణం రేటు అతి స్వల్వంగా 5.95 శాతానికి తగ్గింది. 2023 జనవరిలో ఆహార ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో (ఫిబ్రవరి 2022) ఆహార ద్రవ్యోల్బణం 5.85 శాతంగా ఉంది. 


2023 ఫిబ్రవరి నెలలో ఆహార ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 16.73 శాతంగా ఉంది. పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రేటు 9.65 శాతంగా ఉంది, సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం రేటు 20 శాతం నుంచి 20.20 శాతానికి పెరిగింది. పండ్ల ద్రవ్యోల్బణం 6.38 శాతం, గుడ్ల ద్రవ్యోల్బణం 4.32 శాతంగా ఉంది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం 4.09 శాతంగా ఉంది. ప్యాక్‌డ్‌ మీల్స్‌, స్నాక్స్‌, మిఠాయిల ద్రవ్యోల్బణం 7.98 శాతంగా ఉంది. అయితే, ఇదే కాలంలో కూరగాయలు కాస్త చౌకగా మారాయి. కూరగాయల ద్రవ్యోల్బణం -11.61 శాతానికి తగ్గింది.


అప్పు మరింత ఖరీదు కావచ్చు!                           
రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఇప్పటికీ RBI టాలరెన్స్‌ బ్యాండ్‌ ‍‌(RBI TOLERANCE BAND) గరిష్ట పరిమితి అయిన 6 శాతం కంటే పైనే ఉంది. పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం సామాన్యుడి పాలిట ప్రమాద ఘంటిక. 2022 నవంబర్, డిసెంబర్‌ నెలల్లో టాలరెన్స్ బ్యాండ్ గరిష్ట పరిమితి కంటే దిగువనే ఉండి ఆశలు పుట్టించిన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. కొత్త ఏడాదిలో రూటు మార్చింది. 2023 జనవరి, ఫిబ్రవరి నెలల్లో, వరుసగా రెండు నెలలు 6 శాతానికి పైగా నమోదైంది. ఫిబ్రవరి 8, 2023న, RBI, తన రెపో రేటును (RBI Repo Rate) పావు శాతం పెంచి 6.50 శాతానికి చేర్చింది. ఇప్పుడు, రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెల కూడా RBI టాలరెన్స్ బ్యాండ్ పైన ఉండడంతో, రుణ రేట్లు ఇంకా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. 


2023 ఏప్రిల్ 3 నుంచి 6 తేదీల మధ్య RBI ద్రవ్య విధాన నిర్ణయ సమావేశం (MPC) ఉంటుంది. ఈ సమావేశంలో, రెపో రేటును RBI పెంచుతుందని మార్కెట్‌ భావిస్తోంది. ఇదే జరిగితే, EMI మరింత ఖరీదు కావచ్చు.