Boycott Turkey and Azerbaijan:నియంత్రణ రేఖ వెంబడి భారతదేశం సైనిక చర్య తర్వాత పాకిస్థాన్‌పై కోపం ఇంకా తగ్గలేదు. ఇంతలో ఆ దేశానికి మద్దతు ఇస్తున్నట్లు ఇటీవల రెండు దేశాలు చేసిన ప్రకటనలు బారతీయులను మరింత ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆదేశాల నుంచి వచ్చే సరకులపను వాడకుంటా బహిష్కరణ ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు పర్యాటకులు కూడా తమ టూర్‌లు రద్దు చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో టర్కీ, అజర్‌బైజాన్‌లకు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. గత రెండు వారాలుగా ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లలో బుకింగ్‌లు గణనీయంగా తగ్గాయి.  

“ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులు కారణంగా గత వారంలో భారతీయ ప్రయాణికులు గట్టి సెంటిమెంట్‌ను వెల్లడించారు. దీని కారణంగానే అజర్‌బైజాన్, టర్కీకి బుకింగ్‌లు 60% తగ్గాయి. అదే సమయంలో క్యాన్సిలేషన్స్‌ కూడా 250% పెరిగాయి” అని మేక్‌మైట్రిప్ ప్రతినిధి తెలిపారు.

రెండు దేశాలకు సంబంధించిన అన్ని ఆఫర్లు, ప్రమోషన్లను నిలిపివేసినట్లు కూడా మేక్‌మైట్రిప్ ప్లాట్‌ఫామ్ తెలిపింది.

“దేశంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సంఘీభావంగా  మా సాయుధ దళాల పట్ల ఉన్న గౌరవంతో, మేము ఈ సెంటిమెంట్‌ను గట్టిగా సమర్ధిస్తున్నాము. అజర్‌బైజాన్,  టర్కీకి ప్రయాణాలకు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నాము” అని కంపెనీ తెలిపింది.

ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు కూడా పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న భారత్‌కు ఇలాంటివి చిరాకు పెడుతున్నాయని అభిప్రాయపడ్డారు.  

“ప్రయాణం ఒక శక్తివంతమైన సాధనం. మనతో నిలబడని ​​వారికి అధికారం ఇవ్వడానికి దీనిని ఉపయోగించవద్దు” అని ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నిశాంత్ పిట్టీ అన్నారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన టర్కీ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. టర్కీపై భారతీయుల కోపంతో రగిలిపోతున్నారు. ప్రజలు ఇప్పుడు టర్కీ వస్తువులను బహిష్కరించడమే కాకుండా అక్కడికి వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు.  

రికార్డు స్థాయిలో భారతీయ పర్యాటకులు అక్కడికి వస్తున్న సమయంలో టర్కీని బహిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గణాంకాలను పరిశీలిస్తే, 2009 సంవత్సరంలో టర్కీని సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 55,000, ఇది 10 సంవత్సరాల తర్వాత 2019లో 2,30,131కి పెరిగింది. దీని తర్వాత, గత సంవత్సరం 2024లో, ఈ సంఖ్య మరింత పెరిగి 3,30,985కి చేరుకుంది.

గత సంవత్సరం అంటే 2024 గణాంకాలను పరిశీలిస్తే, దాదాపు 62.2 మిలియన్ల విదేశీ పర్యాటకులు టర్కీని సందర్శించారు. వీరిలో 3 లక్షలకు పైగా భారతీయ పర్యాటకులు. వారు పర్యాటకం ద్వారా $61.1 బిలియన్ల ఆదాయాన్ని అందించారు. భారతీయ పర్యాటకులు మాత్రమే $291.6 మిలియన్లు ఖర్చు చేస్తారు. అటువంటి పరిస్థితిలో, భారతీయ పర్యాటకులను బహిష్కరించడం వల్ల టర్కీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.

వాణిజ్య సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రధాన కార్యదర్శి, చాందినీ చౌక్ లోక్‌సభ స్థానం ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, టూర్‌ల రద్దు టర్కీ,  అజర్‌బైజాన్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ముఖ్యంగా అక్కడి పర్యాటక రంగం దెబ్బతింటుందని తెలిపారు.  

అజర్‌బైజాన్‌లోని భారతీయ పర్యాటకులను ప్రస్తావిస్తూ ఖండేల్వాల్ మాట్లాడుతూ, 2024 సంవత్సరంలో దాదాపు 2.6 మిలియన్ల మంది పర్యాటకులు అజర్‌బైజాన్‌ను సందర్శించారని, వారిలో 2.5 లక్షల మంది భారతదేశానికి చెందినవారని అన్నారు. ఈ పర్యాటకులు 308.6 మిలియన్ డాలర్లను పర్యాటకులుగా ఖర్చు చేయడం ద్వారా అక్కడి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, భారతీయ పర్యాటకులను బహిష్కరించడం వల్ల భారీ నష్టాలు సంభవించవచ్చు.

గత నెలలో జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన దాడిలో మొత్తం 26 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది పర్యాటకులు. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రమూకలే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తేలడంతో భారత్ సైనిక చర్య చేపట్టింది. పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్ర కర్మాగారాలను తుక్కుతుక్కు చేసింది. ఇది నచ్చని పాకిస్థాన్ భారత్ సైనిక స్థావరాలను టార్గెట్‌ చేసుకుంది. దీంతో భారత్ కూడా పాకిస్థాన్ సైనిక, వైమానిక స్థావరాలపై దాడి చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.  అప్పటికే తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో రెండు దేశాలు శనివారం కాల్పుల విరమణకు అంగీకరించాయి.