Stock Markets Crash: భారతీయ స్టాక్ మార్కెట్లు బ్లాక్ మండేను చూశాయి. భారత మదుపర్లకు చెందిన ఇరవై లక్షల కోట్ల సంపద ఆవిరిగా మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ప్రారంభం కావడం భారత స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఆరంభంలోనే పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. ఓ దశలో 3,900 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరికి 2226 పాయింట్ల నష్టంతో రోజు ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ లో ఒకే ఒక్క షేరు మాత్రమే లాభాల బాటలో నడిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ షేర్ మాత్రమే కాస్త తట్టుకోగా మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. మెటల్ , రియాలిటీ రంగాలకు చెందిన షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
సెన్సెక్స్‌లో ప్రధానంగా టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ,అదానీ పోర్ట్స్,ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లలో భారీ పతనానికి అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లే కారణం. ఇప్పటికే కెనడా పై టారిఫ్‌లు అమల్లోకి రాగా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రతీకార సుంకాలు విధించడానికి సిద్దమవుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, భారత్ మార్కెట్‌పై కూడా దీని ప్రభావం ఉంటుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందడంతో పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా భారీ పతనాన్ని చూస్తున్నాయి. ఫార్మా రంగంపై కూడా భారీ టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించడంతో అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్స్, లుపిన్ వంటి కంపెనీల షేర్లు పడిపోయాయి. ఫైనాన్షియల్,ఎఫ్‌ఎంసీజీ షేర్లను మినహాయించి,మిగిలిన అన్ని రంగాలలో అమ్మకాలు భారీగా పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్ల అమ్మకాల కారణంగా సూచీలపై ప్రతికూల ప్రభావం చూపించింది.
స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు సంపాదించవచ్చనేది భ్రమేనని ఎవరూ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవద్దని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. బీహార్ లో పర్యటిస్తున్న ఆయన దేశంలో ఒక్క శాతం మంది మాత్రమే పెట్టుబడులు స్టాక్స్ లో పెడుతున్నారన్నారు. ]
గతంలోనూ చాలా సార్లు స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఇప్పుడు కూడా అలా పడిపోయినా కోలుకుంటాయని ఎక్కువ మంది నమ్మకంతో ఉన్నారు.