Stock Market Holidays 2023: 2022 సంవత్సరం ముగింపు దశకు వచ్చింది, కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం (2023) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే, భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు 2023 సంవత్సరానికి సెలవుల జాబితాను ప్రకటించాయి. కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లకు చాలా రోజులు సెలవులు వచ్చాయి, ఆయా రోజుల్లో ట్రేడింగ్ జరగదు.
స్టాక్ మార్కెట్లు ఇచ్చిన సెలవుల జాబితా (Holidays List 2023) ప్రకారం, వారాంతాలు మినహా, కొత్త సంవత్సరంలో మరో పక్షం రోజుల పాటు ట్రేడింగ్ జరగదు. అంటే, 2023లో, శని & ఆదివారాలు కాకుండా మరో 15 రోజులు స్టాక్ మార్కెట్ క్లోజ్ అవుతుంది.
మీరు కూడా BSE. NSEల్లో ట్రేడ్ చేస్తుంటే.. ఇది మీకు చాలా ముఖ్యమైన సమాచారం. 2023లో, భారత దేశ గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభమయ్యే స్టాక్ మార్కెట్ సెలవులు, క్రిస్మస్‌తో (మొత్తం 15 రోజులు) ముగుస్తాయి. ఎప్పటిలాగే శని, ఆదివారాల్లో మార్కెట్ పని చేయదు.
2023 సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉండని రోజులు:
జనవరి 26న, యావత్ భారత దేశం రిపబ్లిక్ డే (Republic Day 2023) జరుపుకుంటుంది. కాబట్టి, ఆ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ఉండదు. జనవరిలో ఇక ఇతర (శని, ఆదివారాలు మినహా) సెలవులు లేవు. మార్చి నెలలో హోలీ, శ్రీరామ నవమి సందర్భంగా ట్రేడింగ్ ఆపేస్తారు. ఏప్రిల్ నెలలో, మహవీర్ జయంతి, గుడ్ ఫ్రైడ్, అంబేడ్కర్ జయంతి రూపంలో మూడు సెలవులు వచ్చాయి. మే 1వ తేదీన మహారాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించారు. జూన్‌లో బక్రీద్; ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం; సెప్టెంబర్ నెలలో వినాయక చవితి (గణేష్ చతుర్థి); అక్టోబర్‌లో గాంధీ జయంతి, దసరా; నవంబర్ నెలలో దీపావళి, గురునానక్ జయంతి; డిసెంబర్‌లో క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లు పని చేయవు.
2023లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా:
జనవరి 26, 2023 - గణతంత్ర దినోత్సవం
మార్చి 07, 2023 - హోలీ
మార్చి 30, 2023 - శ్రీరామ నవమి
ఏప్రిల్ 4, 2023 - మహావీర్ జయంతి
ఏప్రిల్ 7, 2023 - గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14, 2023 - అంబేద్కర్ జయంతి
మే 1, 2023 - మహారాష్ట్ర దినోత్సవం
జూన్ 28, 2023 - బక్రీద్
ఆగస్ట్ 15, 2023 - స్వాతంత్ర్య దినోత్సవం
సెప్టెంబర్ 19, 2023 - వినాయక చవితి
అక్టోబర్ 2, 2023 - గాంధీ జయంతి
అక్టోబర్ 24, 2023 - దసరా
నవంబర్ 14, 2023 - దీపావళి
నవంబర్ 27, 2023 - గురునానక్ జయంతి
డిసెంబర్ 25, 2023 - క్రిస్మస్
2023లో ముహూర్తపు ట్రేడింగ్ (Muhurat Trading 2023) ఎప్పుడు?
ప్రతి సంవత్సరం దీపావళి రోజున అంటే లక్ష్మీ పూజ సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో ముహూర్తపు ట్రేడింగ్ (ముహూరత్ ట్రేడింగ్) నిర్వహిస్తారు. ఏళ్ల తరబడి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 2023 సంవత్సరంలో ముహూర్తపు ట్రేడింగ్ నవంబర్ 14, 2023న (మంగళవారం రోజున) జరుగుతుంది. 2023లో జరిగే ఈ ప్రత్యేక ట్రేడింగ్ గురించిన సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా పెట్టుబడిదారులకు అందుతుంది. ట్రేడింగ్ సమయం వివరాలు ఆ సమాచారంలో ఉంటాయి.