Indian Stock Market: భారత స్టాక్‌ మార్కెట్‌ పాత ఘనతను తిరిగి దక్కించుకుంది, ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద స్టాక్ మార్కెట్‌గా నిలిచింది. గ్లోబల్ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి భారత్ ఈ మైలురాయికి చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో, ఆరో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ ఈక్విటీ మార్కెట్‌, ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ను అధిగమించి ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది.


అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయంటూ US షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఈ ఏడాది జనవరి 24వ తేదీన బ్లాస్టింగ్‌ రిపోర్ట్‌ రిలీజ్‌ చేసింది. ఆ బ్లాస్ట్‌కు అదానీ షేర్లు అల్లాడాయి, విపరీతంగా పతనమయ్యాయి. ఆ ఒత్తిడి మొత్తం ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ మీద పడింది. దీంతో, భారతీయ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ భారీగా తగ్గింది. ఆ దెబ్బకు భారత మార్కెట్‌ ఫ్రాన్స్ కంటే వెనుకబడింది. అయితే, ఇటీవలి కాలంలో అదానీ షేర్ల రికవరీతో భారత స్టాక్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. కోల్పోయిన గత ఘనతను తిరిగి సాధించి, ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద స్టాక్ మార్కెట్‌గా తిరిగి గర్వంగా కాలర్‌ ఎగరేసింది.


$3.3 ట్రిలియన్లకు చేరిన మన స్టాక్ మార్కెట్ విలువ 
గత శుక్రవారం నాడు (26 మే 2023), భారతదేశ స్టాక్ మార్కెట్ మొత్తం మార్కెట్ విలువ 3.3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అదానీ షేర్లలో బలమైన రికవరీతో పాటు ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIలు) ద్వారా వచ్చిన విదేశీ నిధులతో విపరీతమైన కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ విలువ పెరిగింది. అదే సమయంలో, ఐదో స్థానంలో ఉన్న ఫ్రాన్స్, గత వారం దాని మార్కెట్ విలువలో 100 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టపోయింది. ఫ్రెంచ్ మార్కెట్‌లో, లగ్జరీ వస్తువుల తయారీదారు LVMH కంపెనీ షేర్లలో భారీ అమ్మకాలు కనిపించడమే దీనికి కారణం. అమెరికా, చైనాలో ఆర్థిక మాంద్యం భయాల కారణంగా ఆయా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీని ప్రభావం ఫ్రాన్స్ స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపించింది.


భారత్‌కు కలిసి వస్తున్న చైనా వెనుకబాటు
చైనాలో కుంటుపడుతున్న ఆర్థిక సంస్కరణల వల్ల భారత్ లాభపడుతోంది. ఫలితంగా, ఆసియాలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా నుంచి విదేశీ పెట్టుబడులు భారతీయ స్టాక్స్‌లోకి రావడం కనిపిస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి విదేశీ పెట్టుబడిదార్లు ఇండియన్‌ ఈక్విటీల్లోకి 5.7 బిలియన్‌ డాలర్లు పంప్‌ చేశారు. ఇటీవలి కాలంలో, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే అత్యధిక GDP వృద్ధి రేటును భారతదేశం సాధించింది. ఇక్కడ కనిపిస్తున్న స్థిరమైన ఆదాయ వృద్ధి వాతావరణం విదేశీ పెట్టుబడిదార్లను మెప్పించింది. వాళ్లతో పాటు దేశీయ పెట్టుబడిదార్లు కూడా స్టాక్‌ మార్కెట్‌లోకి డబ్బులు కుమ్మరించడం ప్రారంభించారు.


9 శాతం కోలుకున్న సెన్సెక్స్‌
S&P BSE సెన్సెక్స్, మార్చి మధ్యకాలంలో చేసిన డైవ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 శాతానికి పైగా రాబడిని చూపించింది. అదానీ గ్రూప్‌ స్టాక్ ధరల్లో అక్రమాలకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు కనిపించలేదని సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ రిపోర్ట్‌ చేయడంతో అదానీ గ్రూప్ స్టాక్స్‌ అదృష్టం తిరిగి వచ్చింది, పుంజుకోవడం మొదలు పెట్టాయి. అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలు గత వారం తమ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు దాదాపు 15 బిలియన్‌ డాలర్లను జోడించాయి. దీంతో మొత్తం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్ బుల్లిష్‌గా మారింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.