Reduction Of Rail Tickets Advance Reservation Period: రైలు టికెట్ల రిజర్వేషన్‌ ముందస్తు బుకింగ్‌ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా గందరగోళం చెలరేగడంతో, అన్ని అనుమానాలను తీరుస్తూ రైల్వే బోర్డ్‌ ‍‌(Indian Rail Board) ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకవిధంగా చూస్తే, గడువు తగ్గింపు నిర్ణయంపై వివరణ ఇచ్చింది. రైలు టిక్కెట్ల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పిరియడ్‌ (ARP) ఎక్కువగా ఉండటం పెద్ద సంఖ్యలో క్యాన్సిలేషన్స్‌ జరుగుతున్నాయని, బెర్తులు వృథా అవుతున్నాయని రైల్వే బోర్డ్‌ తన వివరణలో వెల్లడించింది. క్యాన్సిలేషన్లు & బెర్తులు వృథాను తగ్గించి నిజమైన ప్రయాణీకులకు బెర్తులను అందుబాటులో ఉంచడమే రైల్వే శాఖ నిర్ణయం వెనకున్న ఉద్దేశమని స్పష్టం చేసింది.


21 శాతం టిక్కెట్లు క్యాన్సిల్‌ - 5 శాతం మంది నో జర్నీ
ప్రస్తుతం, రైల్వేలో టిక్కెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ 120 రోజులుగా ఉంది. అంటే, ప్రయాణ తేదీకి 120 రోజుల ముందే టిక్కెట్‌/టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని 60 రోజులకు తగ్గిస్తూ బుధవారం (16 అక్టోబర్‌ 2024) నాడు భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నిజమైన రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని తన వివరణలో రైల్వే బోర్డు తెలిపింది. 61 రోజుల నుంచి 120 రోజుల మధ్య చేసిన రిజర్వేషన్లలో 21 శాతం టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నట్లు తాము గమనించినట్లు వెల్లడించింది. 5 శాతం మంది ప్రయాణం చేయట్లేదు, టిక్కెట్‌ను కూడా రద్దు చేయట్లేదని పేర్కొంది. ఫలితంగా పెద్ద సంఖ్యలో సీట్లు వృథా అవుతున్నాయంది. ఇది, సీట్ల కేటాయింపుల్లో మోసాలకు & రైల్వే అధికారులు లంచాలు తీసుకోవడానికి కారణమవుతోందని చెప్పింది. తాజా నిర్ణయంతో ఇలాంటి అక్రమాలను నిరోధించవచ్చని, నిజమైన ప్రయాణీకులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుందని రైల్వే బోర్డు వెల్లడించింది. పీక్ సీజన్‌లో ప్రత్యేక రైళ్లను నడపడంలోనూ ఈ నిర్ణయం ఇండియన్‌ రైల్వేస్‌కు సాయపడుతుందని తన ప్రకటనలో పేర్కొంది. 


కాలానుగుణంగా చాలా మార్పులు
పరిస్థితులను బట్టి, రైలు టిక్కెట్ల అడ్వాన్‌ బుకింగ్‌ గడువులో మార్పులు వస్తూనే ఉన్నాయని రైల్వే బోర్డు వెల్లడించింది. గతంలో ఈ గడువు 30-120 రోజుల మధ్య ఉండేదని గుర్తు చేసింది. 1981 నుంచి 2015 వరకు, కాలానుగుణంగా మార్పులు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది. ఇన్నేళ్ల అనుభవాల తర్వాత, నిజమైన ప్రయాణికులకు 60 రోజుల గడువు ఉపయోగపడుతుందని గుర్తించినట్లు స్పష్టం చేసింది.


కొత్త నిర్ణయం నవంబర్‌ 1 నుంచి అమలు
రైలు టికెట్ల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పిరియడ్‌ను 60 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది నవంబర్‌ (01 నవంబర్‌ 2024) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నెలాఖరు (31 అక్టోబర్‌ 2024‌) వరకు 120 డేస్‌ పిరియడ్‌ అమల్లో ఉంటుంది. అంటే, 120 రోజుల కోసం ముందస్తుగా టిక్కెట్లు బుక్‌ చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంటుంది. రైల్వే బోర్డు నిర్ణయం వల్ల ఇ-టికెట్‌లపై వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజు నుంచి ఇంటర్నెట్ టికెటింగ్ ఆదాయం వరకు ఎటువంటి ప్రభావం చూపదని IRCTC కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.


మరో ఆసక్తికర కథనం: ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు