Atal Pension Yojana Benifits and Details In Telugu: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ పథకం "అటల్ పెన్షన్ యోజన" (APY) బాగా క్లిక్‌ అయింది. ఈ స్కీమ్‌లో చేరిన చందాదార్ల సంఖ్య ఇప్పుడు 7 కోట్ల మైలురాయిని దాటింది. ఈ పెన్షన్ పథకం ప్రస్తుతం 10వ సంవత్సరంలో ఉంది. 2015 మే నెలలో, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, అసంఘటిత కార్మికుల కోసం ఈ పింఛను పథకాన్ని ప్రారంభించింది. దేశంలోని ప్రతి సీనియర్ సిటిజన్‌కు ప్రతి నెలా ఒక ఫిక్స్‌డ్ అమౌంట్‌ అందాలన్నది APY ఉద్దేశం.


ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం... 2024-25 ఆర్థిక సంవత్సరం (FY 2024-25) మొదటి ఆరు నెలల్లో ‍‌(ఏప్రిల్‌-సెప్టెంబర్‌) అటల్ పెన్షన్ యోజనలో 56 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. వీరితో కలిపి, ఈ పెన్షన్ పథకంలో మొత్తం గ్రాస్‌ రిజిస్టర్స్‌ 7 కోట్లు దాటాయి. సమాజంలోని పేద ప్రజలకు, అసంఘటిత రంగంలో పని చేస్తున్న వ్యక్తులకు కూడా పెన్షన్ కవరేజీని అందించడం లక్ష్యంగా అటల్ పెన్షన్ యోజన స్టార్ట్‌ అయింది. తద్వారా, కుటుంబంలో పని చేసే వ్యక్తి రిటైర్‌ అయిన తర్వాత కూడా ఆ కుటుంబానికి నెలనెలా ఆర్థిక సాయం అందుతుంది. 


అటల్ పెన్షన్ యోజన పథకం ప్రయోజనాలు
అటల్ పెన్షన్ యోజన పథకం చందాదార్లు 'సంపూర్ణ సురక్ష కవచ్‌' (Sampurna Suraksha Kavach) కిందకు వస్తారు. అంటే, చందాదారు జీవించి ఉన్నంతకాలం హామీతో కూడిన పెన్షన్‌ డబ్బును అందించడమే కాకుండా, అతను/ ఆమె మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి కూడా పింఛను అందించేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు. ఇది మాత్రమే కాదు, అటల్ పెన్షన్ యోజన చందాదారు & జీవిత భాగస్వామి మరణించిన తర్వాత, 60 సంవత్సరాల వయస్సు వరకు కూడబెట్టిన మొత్తం డబ్బు ఆ కుటుంబానికి తిరిగి వస్తుంది.


అర్హతలు
18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఈ స్కీమ్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. దరఖాస్తుదారు ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా (Bank Savings Account) ఉండాలి. ఆధార్ నంబర్ (Aadhar Number), మొబైల్ నంబర్ (Mobile Number) కూడా ఉండాలి. ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తులు అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అనర్హులు.


ఎంత పింఛను వస్తుంది?
సబ్‌స్క్రైబర్‌కు 40 సంవత్సరాలు వచ్చే వరకు అటల్‌ పెన్షన్‌ యోజనలో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. సబ్‌స్క్రైబర్‌కు 60 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుంచి, నెలనెలా కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.5,000 వరకు పింఛను వస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 వరకు పెన్షన్ పొందొచ్చు. చందాదారు మరణిస్తే, జీవిత భాగస్వామికి జీవితాంతం పెన్షన్ అందుతుంది. ఇద్దరూ చనిపోతే పింఛను మొత్తం నామినీకి ఇస్తారు. అటల్ పెన్షన్ యోజన సబ్‌స్క్రైబర్లకు 2035 నుంచి పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది.


మరో ఆసక్తికర కథనం: చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి