గత రెండేళ్లుగా తమ ఉద్యోగాల విషయంలో ఉద్యోగుల్లో కాస్త అనిశ్చితి నెలకొన్న వేళ.. తాజా సర్వే ఒకటి ఊరట కలిగిస్తోంది. 2022 ఏడాదిలో జీతాల విషయంలో ఇంక్రిమెంట్లు ఐదేళ్ల గరిష్ఠంగా ఉండొచ్చని ఓ సర్వే వెల్లడించింది. సరాసరిన ఈ ఏడాది 9.9 శాతం ఇంక్రిమెంట్లు ఉండవచ్చని ఆ సర్వే అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు గతేడాదితో పోలిస్తే 2022 ఏడాదిలో అధికంగా ఇంక్రిమెంట్లు ఉంటాయని అయాన్స్ అనే గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ వెల్లడించింది. జీతాల ఇంక్రిమెంట్లు సరాసరిన 2021లో 9.3 శాతం ఉండగా.. ఈ ఏడాది 9.9 శాతం ఉంటుందని వెల్లడించింది.
ఆ దేశాల కంటే బెటర్
ఈ సర్వే అంచనాలతో బ్రిక్స్ - BRICS (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రియా) దేశాలలోని ఇతర దేశాల కంటే కూడా భారత్‌లోనే ఉద్యోగులకు అధిక ఇంక్రిమెంట్లు ఉండనున్నాయి. ఈ సర్వే ప్రకారం చైనాలో కేవలం 6 శాతం మాత్రమే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందనున్నాయి. రష్యాలో 6.1 శాతంగా ఉంది. బ్రెజిల్‌లో ఇంకా తక్కువగా 5 శాతం మాత్రమే జీతాల పెంపు ఉంటుందని అయాన్ సంస్థ అంచనా వేసింది.
ఈ సర్వే కోసం మొత్తం మొత్తం 40 వేర్వేరు రంగాల నుంచి దాదాపు 1500 కంపెనీలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో ఈ - కామర్స్, వెంచర్ క్యాపిటల్, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అధిక జీతాల పెంపు ఉండనున్నట్లుగా సర్వేలో తేలింది.
‘‘ప్రస్తుత అస్థిర కాలం మధ్య ఉద్యోగులకు జీతాల పెంపుదల స్వాగతించేదిగా ఉంటుంది. అదే సమయంలో యజమానులు లేదా కంపెనీలకు ప్రతిభకు వెచ్చించే ఖర్చు పరంగా చూస్తే ఇది రెండు వైపులా పదునుగల కత్తిగా అవ్వగలదు. ఈ ధోరణి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సహా ఒక స్థిరమైన శ్రామికశక్తిని నిర్మించడానికి దోహదం చేస్తుంది. అంతేకాక, కంపెనీలు కూడా కొత్త సామర్థ్యాలలో పెట్టుబడులు పెట్టేందుకు సహకరిస్తుంది’’ అని అయాన్స్ హ్యూమన్ క్యాపిటల్ సొల్యూషన్స్ ఇన్ ఇండియా పార్టనర్, సీఈవో నితిన్ సేథి అభివర్ణించారు.