భారత్‌ రూపొందించిన యూనిఫైడ్ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్ (UPI)ను వాడుతున్న తొలి పొరుగు దేశంగా నేపాల్‌ రికార్డు సృష్టించింది. ఆ దేశంలో డిజిటల్‌ ఎకానమీకి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. యూపీఐ సేవల వ్యవస్థను నేపాల్‌ అమలు చేయనుందని భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) ప్రకటించింది. హిమాలయ దేశంలో యూపీఐ సేవలు అందించేందుకు ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ (NIPL), గేట్‌వే పేమెంట్స్‌ సర్వీస్‌ (GPS), మనం ఇన్ఫోటెక్‌ చేతులు కలిపాయి.


'భారత్‌ ఆవల యూపీఐ వ్యవస్థను అమలు చేయబోతున్న తొలి దేశం నేపాల్‌. దేశాన్ని డిజిటల్‌ ఎకానమీ వైపు తీసుకెళ్లాలన్న నేపాల్‌ ప్రభుత్వం, నేపాల్‌ రాష్ట్ర బ్యాంకు దార్శనికతకు ఈ చెల్లింపుల వ్యవస్థ దోహదం చేస్తుంది' అని ఎన్‌పీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. గేట్‌వే పేమెంట్స్‌ సర్వీస్‌ నేపాల్‌ అధికారిక చెల్లింపుల ఆపరేటర్‌. మనం ఇన్ఫోటెక్‌ యూపీఐని ఆ దేశంలో అమలు చేయనుంది.


నేపాల్‌లో రియల్‌టైం పర్సన్‌ టు పర్సన్‌ (P2P), పర్సన్‌ టు మర్చంట్‌ (P2M) లావాదేవీలు, ప్రజల డిజిటల్ ప్రయోజనాలకు ఈ సహకారం ఉపయోగపడనుంది. వెంటవెంటనే రియల్‌ టైమ్‌లో బ్యాంకులు మధ్య, మర్చంట్‌ పేమెంట్ల మధ్య లావాదేవీలను నేపాల్‌లోని మూలమూలల్లోని ప్రజలు ఉపయోగించుకోగలరు. అంతేకాకుండా భారత్‌, నేపాల్‌లోని ప్రజలు పీ2పీ లావాదేవీలు చేసుకోవచ్చని జీపీఎస్‌ సీఈవో రాజేశ్ ప్రసాద్‌ మనన్‌దార్‌ అంటున్నారు. ఇప్పటికే భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల పరివర్తనకు యూపీఐ సేవలు సానుకూల ప్రభావం చూపించాయని వెల్లడించారు.


యూపీఐ వల్ల 940 బిలియన్‌ డాలర్ల విలువైన 3,900 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఎన్‌పీసీఐ తెలిపింది. ఇది భారత జీడీపీలో 31 శాతానికి సమానమని వెల్లడించింది. నేపాల్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు యూపీఐ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది.