India’s WPI Inflation: దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం షాక్‌ ఇస్తే, టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రం ఊరటనిచ్చింది. 


2023 జనవరి నెలలో 4.73 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (wholesale price index based inflation), ఫిబ్రవరిలో 3.85 శాతానికి తగ్గిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.


"2023 ఫిబ్రవరిలో ముడి పెట్రోలియం & సహజ వాయువు, ఆహారేతర పదార్థాలు, ఆహార ఉత్పత్తులు, ఖనిజాలు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ & ఆప్టికల్ ఉత్పత్తులు, రసాయనాలు & రసాయన ఉత్పత్తులు, విద్యుత్ పరికరాలు, మోటారు వాహనాలు, ట్రైలర్స్‌ & సెమీ ట్రైలర్ల ధరలు తగ్గడం వల్ల WPI ఆధారిత ద్రవ్యోల్బణం రేట క్షీణించింది" అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.


కార్పొరేట్ల మీద తగ్గనున్న ఒత్తిడి
టోకు ధరల తగ్గుదలతో కార్పొరేట్ ఆదాయాలపై ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి, తాజా WPI నంబర్‌ కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ పెట్టుబడి వ్యయాల (input costs) వల్ల, ఈ కంపెనీ ఉత్పత్తుల రిటైల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.


ఆహార పదార్థాలు, మినరల్ ఆయిల్స్, క్రూడ్ పెట్రోలియం & సహజ వాయువు, ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, రసాయనాలు & రసాయన ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల జనవరిలో WPI ద్రవ్యోల్బణం 24 నెలల కనిష్ట స్థాయి 4.73 శాతానికి తగ్గింది. గత కొన్ని నెలలుగా WPI ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది.


భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలిచే రెండు సూచీల్లో ఒకటి WPI ఆధారిత ద్రవ్యోల్బణం, మరొకటి వినియోగదారు ధరల ఆధారిత (CPI) ద్రవ్యోల్బణం. కంపెనీ నుంచి కంపెనీ మధ్య చేతులు మారే జరిగే వస్తువుల ధరలను వాటి ఉత్పత్తి స్థాయిలో WPI ద్రవ్యోల్బణం కోసం పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి వ్యతిరేకంగా, రిటైల్‌ వినియోగదార్ల స్థాయిలో ధరలను CPI ద్రవ్యోల్బణం కోసం పరిగణనలోకి తీసుకుంటారు. 


6% పైనే రిటైల్ ద్రవ్యోల్బణం
టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుంటే, చిల్లర ద్రవ్యోల్బణం మాత్రం చుక్కలు చూపిస్తోంది. 2023 ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation) 6.44 శాతంగా నమోదైంది. 2023 జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉండగా, ఈ స్థాయి కంటే ఫిబ్రవరిలో కాస్త తగ్గింది. గత సంవత్సరం ఇదే కాలంలో (ఫిబ్రవరి 2022) రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా ఉంది. అంటే, ఏడాది క్రితం కంటే ఇప్పుడు ఎక్కువగానే ఉంది. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు స్వల్పంగా తగ్గడంతో, 2023 ఫిబ్రవరిలో చిల్లర ద్రవ్యోల్బణం కాస్త తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.


రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి గల కారణాలను పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో ఆహార ద్రవ్యోల్బణం రేటు అతి స్వల్వంగా 5.95 శాతానికి తగ్గింది. 2023 జనవరిలో ఆహార ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో (ఫిబ్రవరి 2022) ఆహార ద్రవ్యోల్బణం 5.85 శాతంగా ఉంది. ఆహార ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 16.73 శాతంగా ఉంది. పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రేటు 9.65 శాతంగా ఉంది, సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం రేటు 20 శాతం నుంచి 20.20 శాతానికి పెరిగింది. పండ్ల ద్రవ్యోల్బణం 6.38 శాతం, గుడ్ల ద్రవ్యోల్బణం 4.32 శాతంగా ఉంది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం 4.09 శాతంగా ఉంది. ప్యాక్‌డ్‌ మీల్స్‌, స్నాక్స్‌, మిఠాయిల ద్రవ్యోల్బణం 7.98 శాతంగా ఉంది. అయితే, ఇదే కాలంలో కూరగాయలు కాస్త చౌకగా మారాయి. కూరగాయల ద్రవ్యోల్బణం -11.61 శాతానికి తగ్గింది.


2023 ఏప్రిల్ 3 నుంచి 6 తేదీల మధ్య RBI ద్రవ్య విధాన నిర్ణయ సమావేశం (MPC) ఉంటుంది. ఈ సమావేశంలో, రెపో రేటును RBI పెంచుతుందని మార్కెట్‌ భావిస్తోంది. ఇదే జరిగితే, EMI మరింత ఖరీదు కావచ్చు.