India Service PMI: ప్రాథమిక రంగంగా వ్యవసాయం ‍‌(Agriculture), ద్వితీయ రంగంగా పారిశ్రామిక రంగం (Industrial sector) తర్వాత తృతీయ రంగంగా సేవల రంగం ఉన్నా, దేశాభివృద్ధిలో దీనిది కీ రోల్‌. ఈ సెక్టార్‌కు సంబంధించి, సర్వీస్ PMI జులై నెల డేటా రిలీజ్‌ అయింది. సర్వీస్ PMI, 2023 జులైలో 62.3కి చేరింది. ఇది జూన్‌లో 58.5గా ఉంది. జులై నెలలో ఇది కొద్దిగా తగ్గి 58 స్థాయికి దిగి వస్తుందంటూ ఎక్స్‌పర్ట్స్‌ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి.


13 సంవత్సరాల గరిష్ట స్థాయికి సేవా రంగం PMI 
జులై నెలలో 62.3 స్థాయికి చేరిన S&P గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI), ఇప్పుడు 13 సంవత్సరాల గరిష్ట స్థాయిని అందుకుంది. దేశ సేవల రంగంలోని అద్భుతమైన వృద్ధిని ఇది చూపుతోంది. ఇంతకుముందు, 2010 జూన్‌ నెలలో హై రేంజ్‌ సర్వీస్ PMI నమోదైంది. 13 సంవత్సరాలకు గానీ మళ్లీ ఆ స్థాయిని అందుకోలేదు.


వరుసగా 24వ నెల వృద్ధి
సర్వీస్‌ సెక్టార్‌లో గ్రోత్‌ జోన్‌లో ఉరకలేస్తోంది. సేవల రంగం PMI 50 కంటే పైనే ఉండటం ఇది వరుసగా 24వ నెల (రెండు సంవత్సరాలు). అంటే, భారతదేశ సేవల రంగం వరుసగా 24వ నెల కూడా వృద్ధిని నమోదు చేసింది. 


సర్వీస్ PMI ఎలా లెక్కిస్తారు?
సేవల రంగం పురోగతిలో వేగాన్ని PMI సూచిస్తుంది. PMI 50 కంటే ఎక్కువగా ఉంటే, ఆ నిర్దిష్ట కాలంలో అభివృద్ధి వేగంగా అడుగులేసిందని నమ్ముతారు. PMI 50 కంటే తక్కువ అంటే వృద్ధి వేగం తగ్గిందని, PMI 50గా ఉంటే గ్రోత్‌ బస్‌ ఒకే స్పీడ్‌లో వెళ్తోందని భావిస్తారు. 400 సర్వీస్‌ కంపెనీల డేటా ఆధారంగా ఈ సర్వే జరుగుతుంది. నాన్-రిటైల్ కన్జ్యూమర్‌ సర్వీస్‌, ట్రాన్స్‌పోర్ట్‌, కమ్యూనికేషన్‌, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌, రియల్ ఎస్టేట్, బిజినెస్‌ సర్వీస్‌ రంగాల్లో ఈ సర్వే జరుగుతుంది. 


మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్
సర్వీస్ PMI లాగే మాన్యుఫాక్చరింగ్‌ PMI కూడా చాలా కీలక డేటా. జులై నెలకు సంబంధించిన డేటా రెండు రోజుల క్రితం రిలీజ్‌ అయింది, దేశంలో తయారీ వేగం కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. S&P Global సర్వే ప్రకారం, జూలైలో తయారీ రంగానికి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) 57.7గా ఉంది. వరుసగా రెండో నెలలోనూ ఇది తగ్గింది. జూన్‌లో ఇది 57.8గా ఉంది, మే నెలలోని 58.7 వద్ద నుంచి వేగంగా కిందికి దిగింది. జులైలో కొత్త ఆర్డర్స్‌లో బలం పెరగడంతో, మరీ ఎక్కువ క్షీణత రాకుండా ఆగింది. జులై నెల డేటాను బట్టి, ఇండియన్‌ మాన్యుఫాక్చరింగ్‌ సెక్టార్‌లో వృద్ధి వేగం మందగించే సిగ్నల్స్‌ ఏవీ కనిపించలేదు. జులై నెలలో కొత్త ఆర్డర్‌ల రాకలో స్వల్పంగా మెరుగపడ్డా, అవుట్‌పుట్‌లో స్వల్ప తగ్గుదల కారణంగా తయారీ PMIలో స్వల్ప బలహీనత కనిపించింది. అయితే, దేశంలో విస్తరణ కార్యకలాపాల వేగం ఎక్కువగానే ఉంది. 


జూన్‌లో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతానికి తగ్గింది. అయితే, రానున్న నెలల్లో ఇది మరింత పెరగవచ్చని అంచనా. ఈ కారణంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పాలసీ రేట్లను ఎక్కువ కాలం హై పిచ్‌లోనే ఉంచవచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది.