How to Earn Interest on Household Gold:    భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ, సెంటిమెంట్ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. శుభకార్యం ఏదైనా, పండగ ఏదైనా సెంటిమెంట్‌గా కొనే పసిడి.. కాలక్రమేణా ఇళ్లలోని లాకర్లలోనో, బ్యాంకు బీరువాల్లోనో నిరుపయోగంగా  ఉండిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్ నివేదికల ప్రకారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారతీయ కుటుంబాల వద్ద సుమారు 30,000 టన్నుల గృహ వినియోగ బంగారం నిద్రాణంగా ఉంది. అంతర్జాతీయంగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో.. ఈ భారీ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థలోకి  తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన సరికొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. పెరిగిపోతున్న పసిడి ధరలు దేశ దిగుమతి బిల్లుపై , రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో, పాత  గోల్డ్ మానిటైజేషన్ స్కేమ్  కు కీలక మార్పులు చేస్తూ కేంద్రం ఈ కొత్త సంస్కరణను తీసుకురాబోతోంది.

Continues below advertisement

ఆగస్టు నుంచి బంగారం వడ్డీ స్కీమ్ 

 ఈ పునరుద్ధరించిన   కొత్త విధానాన్ని రాబోయే ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. నిజానికి, గతంలో 2015లోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. నాటి నుండి ఇప్పటివరకు దశాబ్ద కాలంలో కేవలం 39 టన్నుల బంగారాన్ని మాత్రమే ప్రభుత్వం ఈ పథకం కింద సేకరించగలిగింది. కఠినమైన బ్యాంకింగ్ నిబంధనలు, బంగారాన్ని కరిగించడానికి కస్టమర్లకు ఉండే సెంటిమెంట్ అడ్డంకులు, ప్యూరిటీ వెరిఫికేషన్ సెంటర్ల కొరత , అవగాహన లోపం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అందుకే ఈసారి సాంప్రదాయ బ్యాంకులపైనే కాకుండా, ఏకంగా  జువెలర్స్ నే నేరుగా రంగంలోకి దించాలని కేంద్రం డిసైడ్ అయింది. ఈ కొత్త పాలసీలోని అత్యంత కీలకమైన మార్పు ఏంటంటే.. ఇకపై సామాన్య ప్రజలు తమ వద్ద ఉన్న నిరుపయోగ బంగారాన్ని డిపాజిట్ చేయడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తాము క్రమం తప్పకుండా వెళ్లే, నమ్మకమైన స్థానిక జువెల వద్దకే నేరుగా వెళ్లవచ్చు.

Continues below advertisement

బంగారు వ్యాపారులకే బాధ్యతలు బంగారం వ్యాపారులే నేరుగా కస్టమర్ల నుంచి ఈ పసిడి డిపాజిట్లను సేకరించి, వాటిని ఒకచోట చేర్చే  బాధ్యతను తీసుకుంటారు. తరతరాలుగా స్థానిక వ్యాపారులతో భారతీయ కుటుంబాలకు ఉండే సత్సంబంధాలను, నమ్మకాన్ని వాడుకోవడం ద్వారా ఈ స్కీమ్‌ను విజయవంతం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. జువెలర్లను కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్లు గా గుర్తించడం ద్వారా మౌలిక సదుపాయాల కొరతను అధిగమించవచ్చు. ఈ సరికొత్త వ్యూహం వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు జువెలర్లకు ,  సామాన్య వినియోగదారులకు ముగ్గురికీ లాభం చేకూరనుంది  . దేశీయంగానే పాత బంగారం రీసైక్లింగ్ ద్వారా అందుబాటులోకి రావడం వల్ల జువెలర్లకు విదేశాల నుంచి కొత్త బంగారాన్ని దిగుమతి చేసుకునే సోర్సింగ్ ఖర్చులు , ప్రీమియంలు భారీగా తగ్గుతాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో బంగారం కొరత తగ్గుతుంది. మరోవైపు, ఇళ్లలో లాకర్లకే పరిమితమై ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వని బంగారానికి ప్రభుత్వం బాండ్ల రూపంలో వార్షిక వడ్డీ కల్పిస్తుంది కాబట్టి, సామాన్య ప్రజలకు ఇది ఒక అద్భుతమైన అదనపు ఆదాయ వనరుగా ,  సురక్షితమైన పెట్టుబడిగా మారుతుంది. డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత అంతే బరువు గల స్వచ్ఛమైన బంగారాన్ని లేదా నాటి మార్కెట్ ధర ప్రకారం నగదును పొందే వెసులుబాటు కూడా ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థకు కీలకం

దేశ ఆర్థిక చిత్రం  పరంగా చూస్తే, ఈ నిర్ణయం అత్యంత కీలకం కానుంది. భారతదేశం ప్రతి ఏటా వందల టన్నుల బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం  బయటకు వెళ్ళిపోతూ కరెంట్ అకౌంట్ డెఫిసిట్  పై ఒత్తిడి పెరుగుతోంది. మన దేశ సరిహద్దుల్లోనే ఇళ్లల్లో ఉన్న 30,000 టన్నుల బంగారంలో కేవలం 5 నుండి 10 శాతం భాగాన్ని చలామణిలోకి తీసుకురాగలిగినా.. రాబోయే ఐదేళ్లలో బంగారం దిగుమతులపై భారం సగానికి పైగా తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి  విలువను మరింత బలోపేతం చేయడానికి ఎంతో దోహదపడుతుంది.

భారతీయుల మైండ్ సెట్ మారుతుందా? 

 రాబోయే ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ పాత లోపాలను అధిగమించి ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సాంప్రదాయకంగా  గోల్డ్ లాకర్ సెంటిమెంట్  ను, ఆభరణాల రూపాన్ని మార్చడానికి ఇష్టపడని భారతీయ కుటుంబాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న లీగల్ గ్యారెంటీని, జువెలర్ల ద్వారా లభించబోయే సులువైన డిపాజిట్ ప్రక్రియను ఏ మేరకు అందిపుచ్చుకుంటాయో వేచి చూడాలి. ఈ పథకం గనుక క్షేత్రస్థాయిలో విజయవంతమైతే.. భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త 'పసిడి వెలుగులు' రావడం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.