Buy Jonnagiri gold bar in Kurnool:   ఆంధ్రప్రదేశ్ బులియన్ మార్కెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం  ప్రారంభమయింది.  కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లోని మైనింగ్ ప్రాజెక్ట్ నుండి లభించిన దేశీయ స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు వాణిజ్యపరంగా మార్కెట్లోకి అడుగుపెట్టింది.  మేడ్ ఇన్ జొన్నగిరి   బ్రాండ్ పేరుతో విడుదలైన ఈ బంగారు బిస్కెట్లు ప్రస్తుతం కర్నూలు నగరంలోని ప్రముఖ జ్యువెలరీ దుకాణాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ చారిత్రాత్మక పరిణామంతో దేశంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే ప్రాంతాల జాబితాలో రాయలసీమ గడ్డ సగర్వంగా నిలిచింది. జొన్నగిరి గనుల నుండి వెలికితీసి, అత్యాధునిక సాంకేతికతతో శుద్ధి చేసిన ఈ బంగారు బిస్కెట్లపై ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అధికారిక భౌగోళిక పటాన్ని ముద్రించారు. దాదాపు 99.9%   24 క్యారెట్ల  అత్యంత స్వచ్ఛతతో కూడిన ఈ బిస్కెట్లు  బులియన్ వ్యాపారుల వద్దకు వచ్చాయి.  రాష్ట్రంలోనే తయారైన తొలి అధికారిక బ్రాండ్ బంగారం కావడంతో పాటు, దానిపై ఏపీ మ్యాప్ ఉండటం స్థానిక వినియోగదారులను, వ్యాపారులను ఎంతగానో ఆకర్షిస్తోంది.   జియో మైసూర్ సర్వీసెస్,  డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంయుక్తంగా జొన్నగిరిలో ఈ ప్రతిష్టాత్మక గోల్డ్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. టన్నుల కొద్దీ బంగారు శిలలను  సేకరించి క్రషింగ్ చేయడం ద్వారా ప్రతిరోజూ ఇక్కడ అధిక నాణ్యత కలిగిన ప్యూర్ గోల్డ్ ఉత్పత్తి అవుతోంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటే దేశీయ బంగారు అవసరాలను తీర్చడంలో ఏపీ కీలక పాత్ర పోషించనుంది. జొన్నగిరి బంగారం మార్కెట్లోకి రావడం వల్ల కర్నూలు జిల్లా పారిశ్రామిక రంగానికి పెద్ద ఊపు లభించినట్లయింది. ఈ మైనింగ్ పరిశ్రమ ద్వారా ఇప్పటికే వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించాయి. రాయలసీమ అంటే కేవలం కరువు ప్రాంతం మాత్రమే కాదు, వజ్రాలు, బంగారు గనుల నిలయమని ఈ ప్రాజెక్ట్ మరోసారి నిరూపించింది. భవిష్యత్తులో ఈ  మేడ్ ఇన్ జొన్నగిరి బ్రాండ్ బంగారం దేశీయ అవసరాల్ని కొంత మేర తీర్చనుంది.    ఈ మైనింగ్ ప్రాజెక్టులో ప్రస్తుతం మొదటి దశ కింద 600 ఎకరాల్లో తవ్వకాలు సాగుతున్నాయి. తొలి పూర్తి ఆర్థిక సంవత్సరంలో  దాదాపు 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  రెండో దశ విస్తరణ ప్లాంట్ కూడా పూర్తయితే, ఈ వార్షిక ఉత్పత్తి క్రమంగా 900 కిలోల నుంచి రెండు టన్నుల  వరకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం లభ్యత పరిమితంగానే ఉన్నా, రానున్న రోజుల్లో పూర్తి స్థాయి సామర్థ్యంతో ఈ ప్లాంట్ పనిచేయనుంది. భారతదేశం ప్రస్తుతం ముడి చమురు తర్వాత అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెడుతున్నది బంగారం దిగుమతుల కోసమే. ఏటా మన దేశం సుమారు 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది.  దేశీయంగా లభ్యత పెరగడం ద్వారా ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యం ఆదా అయి, దేశ ఆర్థిక భద్రతకు మేలు జరుగుతుంది.  ఇక్కడ లభించే బంగారంతో స్థానికంగానే జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల స్థానిక యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుంది.

Continues below advertisement

Continues below advertisement