Retail Inflation:
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) జులై నెలలో 7.44 శాతానికి పెరిగింది. జూన్ నెలలో ఇది 4.81 శాతమే కావడం గమనార్హం. 2022, మే నాటి 7.79 శాతంతో పోలిస్తే ఇదే అత్యధిక స్థాయి. రీసెంట్‌గా రాయిటర్స్ ఒక పోల్ నిర్వహించింది. ఇందులో 53 మంది ఎకానమిస్టులు చిల్లర ద్రవ్యోల్బణం 6.40 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేశారు. కానీ వారి అంచనాలను మించే నమోదవ్వడం విశేషం.
ఇక వినియోగదారుల ఆహార పదార్థాల ధరల సూచీ (CFPI) ఏకంగా 11.51 శాతానికి పెరిగింది. జూన్‌లో ఇది 4.49 శాతమే. గ్రామీణ ద్రవ్యోల్బణం 7.63 శాతం, పట్టణ ద్రవ్యోల్బణం 7.20 శాతంగా ఉన్నాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్యలోనే ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరుస నెలలు ఇదే స్థాయిలో ఉన్న రేటు ఇప్పుడు మించిపోయింది.
టమాటా, అల్లం, పచ్చి మిరపకాయలు సహా కూరగాయల ధరలు విపరీతంగా పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణానికి కారణం. వార్షిక ప్రాతిపదికన కూరగాయాల ద్రవ్యోల్బణం రేటు 0.93 శాతం తగ్గుదల నుంచి 37.34 శాతానికి పెరిగింది. ఆహార పదార్థాలు, పానీయాలు వరుసగా 10.57, 4.63 శాతం పెరిగాయి. బియ్యం, తిండిగింజల ఇన్‌ప్లేషన్ రేటు 12.04 శాతం నుంచి 13.04 శాతానికి పెరిగింది. ఇక ఇంధనం రేటు 3.67 శాతంగా ఉంది.
ఇన్‌ఫ్లేషన్ బాస్కెట్‌లో సగానికి పైగా వెయిటేజీ ఉండే ఆహార ధరలు గత రెండు నెలలో విపరీతంగా పెరిగాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల నేపథ్యంలో టమాట కొరత ఏర్పడింది. కిలో రూ.200-270 వరకు వెళ్లింది. మూడు నెలల్లోనే 1400 శాతం పెరిగింది. ఇక అల్లం, పచ్చి మిర్చి ధరలూ చుక్కలను అంటాయి. 'ఆగస్టులో ఆహార ధరల తగ్గుదల ఉండకపోవచ్చు. రాబోయే రెండు నెలలూ సీపీఐ ఇన్‌ప్లేషన్ ఎక్కువగా ఉంటుందని మా అంచనా. 2023 నాలుగో త్రైమాసికం నుంచి తగ్గుదల ఉంటుంది' అని రాయిటర్ తెలిపింది.
No Change In Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు ముచ్చటగా మూడోసారి కూడా ఊరట ప్రకటించింది. రెపో రేట్‌ను పెంచకుండా, యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో, మళ్లీ జరిగే MPC మీటింగ్ వరకు రెపో రేట్ 6.50% వద్దే కొనసాగుతుంది.
ద్రవ్యోల్బణం తగ్గించడంపై దృష్టి
మళ్లీ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై ఆర్‌బీఐ ఫోకస్ పెట్టిందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధి యథాతథంగా ఉంటుందని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. దేశంలో ఇన్‌ఫ్లేషన్, RBI లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, దానిని 4 శాతానికి తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ కృషి చేస్తోందన్నారు. కూరగాయల ద్రవ్యోల్బణం పెరగడం వల్ల మొత్తం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
రిజర్వ్ బ్యాంక్, 2024 ఆర్థిక సంవత్సరానికి (2023-24) ద్రవ్యోల్బణం అంచనాను పెంచింది. 2023-24లో CPI ఇన్‌ఫ్లేషన్ రేట్ 5.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది, గతంలో 5.1 శాతం వద్ద అంచనా ప్రకటించింది. ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భారత ఆర్థిక వ్యవస్థ బాగా పని చేసిందని, మంచి పురోగతిని సాధించిందని శక్తికాంత దాస్ చెప్పారు.
Also Read: హమ్మయ్య! రీబౌండ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ!