Oil Imports:
రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు చైనా కరెన్సీ యువాన్లలో భారత రిఫైనరీ కంపెనీలు చెల్లింపులు చేస్తున్నాయని సమాచారం. వెస్ట్రన్ కంట్రీస్ డాలర్లలో ట్రేడింగ్‌ను నిషేధించడంతో కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల్లో చెల్లిస్తున్నాయి.
ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలవ్వగానే పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అక్కడి నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి. దాంతో ఆ దేశం నుంచి భారత్ మునుపెన్నడూ లేని విధంగా ముడి చమురును దిగుమతి చేసుకొంది. స్థానిక కంపెనీలు ఆ చమురును రిఫైన్ చేసి తిరిగి ఐరోపా దేశాలకు విక్రయించి లాభపడ్డాయి. మొదట్లో రష్యాకు రూపాయిల్లో చెల్లింపులు చేపట్టినప్పటికీ.. వీటిని ఏం చేసుకోవాలని ఆ దేశం ప్రశ్నించింది. దాంతో భారత్ కొంత మేరకు యువాన్లలో చెల్లింపులు చేపట్టినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.
ప్రపంచ వ్యాప్తంగా సుదీర్ఘ కాలంగా చమురు క్రయవిక్రయాలకు అన్ని దేశాలు అమెరికా డాలర్‌ను ప్రామాణికంగా తీసుకున్నాయి. భారత్ సైతం సౌదీ, ఓపెక్ దేశాలు డాలర్లలో రూపంలోనే చెల్లింపులు చేస్తుంది. అయితే ఆంక్షల వల్ల చైనా కరెన్సీ యువాన్‌కు డిమాండ్ పెరుగుతోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు డ్రాగన్ దేశం ఇలాగే చెల్లింపులు చేస్తోంది. ఇతర దేశాలను యువాన్లలో చెల్లించాలని రష్యా కోరుతోంది.
'ట్రేడింగ్ సెటిల్‌మెంట్లను డాలర్లలో చేసేందుకు బ్యాంకులు అంగీకరించకపోతే కొన్ని రిఫైనరీలు యువాన్ వంటి ఇతర దేశాల కరెన్సీల్లో చెల్లింపులు చేస్తాయి' అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జూన్‌లో యువాన్ రూపంలో చెల్లింపులు చేపట్టిందని వారు పేర్కొన్నారు. మూడు ప్రైవేటు కంపెనీల్లో రెండు ఇలాగే చేశారని వెల్లడించారు.
యువాన్లలో చెల్లింపులపై రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, హెచ్‌పీసీఎల్, ఎనర్జీ లిమిటెడ్‌ను సంప్రదించగా ఆ కంపెనీల ప్రతినిధులు స్పందించలేదని తెలిసింది. ఇండియన్ ఆయిల్ సైతం ఇందుకు నిరాకరించింది. అయితే ఇండియన్ రిఫైనరీలు ఎంత మేరకు యువాన్లలో చెల్లింపులు చేశాయో తెలియడం లేదు. కాగా కొన్ని డాలర్ యేతర చెల్లింపులను యూఏఈ దిర్హమ్స్‌లోనూ చెల్లిస్తాయని సమాచారం.
'డాలర్లలో చెల్లించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. కొన్నిసార్లు విక్రేతలు అడిగితే ఇతర కరెన్సీలైన దిర్హమ్స్, యువాన్లలోనూ రిఫైనరీలు చెల్లింపులు చేస్తాయి' అని ప్రభుత్వ వర్గాలు అన్నాయి. చైనాతో సరిహద్దు సమస్యల కారణంగా దిగుమతి చేసుకున్న రష్యా చమురుకు యువాన్లలో చెల్లించొద్దని కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్, రిఫైనరీ కంపెనీలను ఆదేశించినట్టు తెలిసింది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే సమస్యలు సద్దుమణిగినట్టు తెలుస్తోంది.
Also Read: కేవలం ₹100కే రైల్వే స్టేషన్‌లో రూమ్ - హోటల్ గదిలా ఉంటుంది
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial