Indian Stock Market: ఇండియన్ స్టాక్‌ మార్కెట్‌ విలువ, పవర్‌ మరో మెట్టు పైకి చేరాయి. ఇప్పుడు, ప్రపంచంలో నాలుగో అతి పెద్ద స్టాక్ మార్కెట్‌ (world’s fourth-largest stock market) భారతదేశమే. తన సమీప ప్రత్యర్థి హాంగ్‌ కాంగ్‌ (Hong Kong) మీద భారత్‌ పైచేయి సాధించింది, దాన్నుంచి టైటిల్‌ గెలుచుకుంది. భారత్‌ ఆర్థికాభివృద్ధి వేగం, అంతులేని వృద్ధి అవకాశాలు, సరళమైన ప్రభుత్వ విధానాలు గ్లోబల్‌ ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి, ఆహ్వానిస్తున్నాయి.


4.33 ట్రిలియన్‌ డాలర్లకు చేరిన భారత మార్కెట్‌ 
బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) డేటా ప్రకారం, ఇండియన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయిన షేర్ల మొత్తం విలువ సోమవారం ముగింపు నాటికి 4.33 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. హాంగ్‌ కాంగ్‌లో ఇది 4.29 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.


2023 డిసెంబర్ 5న, ఇండియన్‌ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Indian stock market capitalization) తొలిసారిగా 4 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరింది. విశేషం ఏంటంటే, ఈ విలువలో సగం భాగం కేవలం గత నాలుగేళ్లలోనే వచ్చింది.


ప్రస్తుతం, ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఎలివేటెడ్‌ లెవెల్స్‌లో ఉన్నాయి, చాలాకాలంగా మారథాన్‌ రన్‌ చేస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా తలెత్తిన కఠిన సమయాల్లోనూ మార్కెట్‌ పడిపోకుండా ఇండియన్‌ రిటైల్ ఇన్వెస్టర్లు అడ్డుగోడలా నిలబడడం, కార్పొరేట్ ఆదాయాలు బలంగా ఉండడంతో ఈక్విటీలు బాగా పుంజుకుంటున్నాయి. 


ఇండియా ఇప్పుడు చాలా విషయాల్లో చైనాకు ప్రత్యామ్నాయంగా మారింది. స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల్లో రిటైల్‌ పోర్షన్‌ పెరగడం పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయింది. దీంతో.. ప్రపంచ పెట్టుబడిదార్లు, గ్లోబల్‌ కంపెనీల నుంచి ఇండియన్‌ మార్కెట్లలోకి ఫండ్స్‌ నిరంతరం పెరుగుతున్నాయి. 


దేశంలో స్థిరమైన రాజకీయ వ్యవస్థ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారు-ఆధారిత ఆర్థిక వ్యవస్థ కూడా విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.


2023లో, 21 బిలియన్‌ డాలర్లకు పైగా ఫండ్స్‌ విదేశాల నుంచి ఇండియన్‌ షేర్లలోకి వచ్చాయి. దీంతో, బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్ వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా లాభాలు ఆర్జించింది.


కుంగుబాటులో హాంగ్‌ కాంగ్‌ మార్కెట్లు
ఓవైపు, ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సూపర్‌ ఫామ్‌లో సెంచరీలు చేస్తుంటే... మరోవైపు, హాంగ్‌ కాంగ్‌ మార్కెట్లకు క్రీజ్‌లో నిలదొక్కుకోవడం కూడా కష్టంగా మారింది. హాంగ్‌ కాంగ్‌ మార్కెట్లలో చైనా కంపెనీలది కీలక పాత్ర. డ్రాగన్‌ కంట్రీకి చెందిన అత్యంత ప్రభావవంతమైన, ఇన్నోవేటివ్‌ కంపెనీలు కొన్ని హాంగ్‌ కాంగ్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యాయి. హాంగ్‌ కాంగ్‌ ప్రధాన ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ మీద ఆ చైనా కంపెనీల ప్రభావం ఉంటుంది. బీజింగ్‌లో అనుసరిస్తున్న కఠిన వైఖరి డైరెక్ట్‌గా చైనా కంపెనీలను, ఇన్‌-డైరెక్ట్‌గా హాంగ్‌ కాంగ్‌ స్టాక్‌ మార్కెట్లను కుంగదీస్తున్నాయి.


హాంగ్‌ కాంగ్‌లో లిస్ట్‌ అయిన చైనీస్ షేర్ల సూచీ హాంగ్ సెంగ్ చైనా ఎంటర్‌ప్రైజెస్ ఇండెక్స్ (Hang Seng China Enterprises Index) 2023లో నష్టాల్లో ముగిసింది, వరుసగా నాలుగో సంవత్సరం కూడా నష్టాల పరంపరను కొనసాగించింది. ఈ ఇండెక్స్‌ గరిష్ట స్థాయి నుంచి దాదాపు 13% పతనమైంది, దాదాపు రెండు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి చేరుకుంది. అదే సమయంలో.. ఇండియన్ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు రికార్డ్‌ స్థాయికి సమీపంలో ట్రేడవుతున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మార్కెట్లలో ఫుల్‌ జోష్‌ - 550 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 21700 పైన నిఫ్టీ