Stock Market: 


ఈ వారం స్టాక్‌ మార్కెట్లు నాలుగు సెషన్లే పనిచేశాయి. కెనడా వివాదం, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, యూఎస్‌ ఫెడ్‌ అత్యధిక వడ్డీరేట్లనే కొనసాగించడం, ఐరోపాలో ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రాకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి.


బెంచ్‌మార్క్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఊహించని విధంగా పతనమయ్యాయి.  దాంతో టాప్‌ 10 కంపెనీలు ఏకంగా రూ.2,28,690 కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2.69 శాతం 1829 పాయింట్లు ఎరుపెక్కింది. నిఫ్టీ 2.56 శాతం అంటే 518 పాయింట్ల మేర కుంగింది.


టాప్‌ 10 కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ తమ మార్కెట్‌ విలువను నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ మాత్రం పెరిగాయి.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.99,835 కోట్ల మేర నష్టపోవడంతో మార్కెట్‌ విలువ రూ.11,59,154కు చేరింది. ఈ వారం కంపెనీ షేరు విలువ 8 శాతం మేర కుంగింది. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విలువ రూ..71,715 కోట్ల మేర తగ్గి రూ.15,92,661 కోట్లకు చేరుకుంది. ఈ వారం ఈ కంపెనీ షేర్లు నాలుగు శాతం మేర పతనమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకు రూ.29,412 కోట్లు నష్టపోవడంతో మార్కెట్‌ విలువ రూ.6,65,431కు వచ్చింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ రూ.12,964 కోట్లు నష్టపోయింది. మార్కెట్‌ విలువ రూ.5,10,759 కోట్లకు చేరింది.


ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ.6,744 కోట్ల మేర నష్టపోవడంతో మార్కెట్‌ విలువ రూ.6,20,893 కోట్లకు తగ్గింది. ఐటీసీ రూ.6,484 కోట్ల మేర తగ్గడంతో మార్కెట్‌ విలువను రూ.5,52,680 కోట్లుగా ఉంది. బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.1266 కోట్లు నష్టపోగా మార్కెట్ విలువ రూ.4,52,773 కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ రూ.267 కోట్ల మేర మార్కెట్‌ విలువను కోల్పోయింది. రూ.5,33,781 కోట్లకు పరిమితమైంది.


హిందుస్థాన్‌ యునీలివర్‌ రూ.2,913 కోట్ల లాభపడటంతో మార్కెట్‌ విలువ రూ.5,83,239 కోట్లకు పెరిగింది. ఐటీ సంస్థ టీసీఎస్‌ రూ.1024 కోట్లు పెరిగి రూ.13,18,228 కోట్లకు చేరింది. టాప్‌ 10 కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పటికీ నంబర్ వన్‌గా ఉంది. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్‌ యునీలివర్, ఐటీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్ ఫైనాన్స్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


శుక్రవారం మార్కెట్లో ఏం జరిగింది?


భారత స్టాక్‌ మార్కెట్లు వరుస నాలుగో రోజు నష్టపోయాయి. రోజు మొత్తం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో నష్టపోయిన సూచీలు ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో రీబౌండ్‌ అయ్యాయి. ఐరోపా స్టాక్స్‌ పడిపోవడం, యూఎస్‌ వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 68 పాయింట్లు తగ్గి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 82.94 వద్ద స్థిరపడింది.


నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (2.86%), ఎస్బీఐ (1.79%), మారుతీ (2.61%), ఏసియన్‌ పెయింట్స్‌ (1.12%), ఎం అండ్‌ ఎం (1.69%) షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ (2.32%), విప్రో (2.44%), యూపీఎల్‌ (1.83%), సిప్లా (1.66%), బజాజ్‌ ఆటో (1.58%) షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, ఆటో మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్‌, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగాలు పతనమయ్యాయి.