LPG Cylinder Price Cut: ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCs) ప్రతి నెలా ఒకటో తేదీన LPG ధరలను సమీక్షించి కొత్త ధరలను ప్రకటిస్తాయి, కొత్త రేట్లు ఆ నెల మొత్తం అమల్లో ఉంటాయి. జనవరి 01, 2025న కూడా, OMCలు కొత్త గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను వెల్లడిస్తాయి. భారత్‌లో, అధిక స్థాయిలో ఉన్న ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కానీ, ప్రపంచంలో ఎల్‌పీజీని (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన రష్యాలో మాత్రం గ్యాస్‌ ధరలు సగానికి సగం తగ్గాయి. ఆ మంచు దేశంలో, వంట చేయడం దగ్గర నుంచి కార్లు నడపడానికి, ఇంటిని వెచ్చగా ఉంచుకోవడానికి, ఇతర పెట్రోకెమికల్స్ ఉత్పత్తుల వరకు ఎల్‌పీజీని చాలా రకాలుగా ఉపయోగించుకుంటారు.


ఎల్‌పీజీ ధరల్లో భారీ పతనం 
రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, రష్యాలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ధరలు భారీగా తగ్గాయి. నవంబర్ 2024తో పోలిస్తే డిసెంబర్ 2024లో సగానికి పడిపోయాయి. నవంబర్ చివరి నాటికి 28,000 రూబిళ్లకు అందుబాటులో ఉన్న LPG ధర డిసెంబర్ 20 నాటికి 14,000 రూబిళ్లకు, అంటే 140 డాలర్లకు తగ్గింది. ఇది నేరుగా 50 శాతం ధర పతనం.


రష్యాలో ధరలు ఎందుకు తగ్గాయి? 
రష్యాలో భారీ స్థాయిలో చమురు ఉత్పత్తి అవుతుంది, దానిని ఐరోపా దేశాలకు ఎల్‌పీజీని ఎగుమతి చేసేది. కానీ రష్యాపై యూరోపియన్ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా, ఆ దేశం నుంచి ఎల్‌పీజీ ఎగుమతులు భారీగా తగ్గాయి. రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆర్థిక ఆంక్షలు డిసెంబర్ 20, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. రష్యన్ ఎల్‌పీజీని అత్యధికంగా దిగుమతి చేసుకునే పోలాండ్, రష్యా ఎల్‌పీజీ ఎగుమతులపై నిషేధాన్ని ప్రతిపాదించింది. ఈ నిషేధం కారణంగా ఎగుమతులు తగ్గి, రష్యా దేశీయ మార్కెట్‌లోకి సరఫరా పెరిగింది. ఈ కారణంగా ఆ దేశంలో గ్యాస్‌ ధరలు తగ్గాయి.  


ఇతర దేశాలకు ఎగుమతులు పెంచిన రష్యా 
ఇటీవలి కాలంలో.. చైనా, మంగోలియా, ఆర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్ వంటి దేశాలకు రష్యా తన ఎల్‌పీజీ ఎగుమతులు పెంచింది. రష్యా నుంచి ఎల్‌పీజీ దిగుమతులు పెంచుకోవాలన్న అంశాన్ని చైనా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో, భారతదేశం రష్యా నుంచి చౌక ధరలకు ముడి చమురును దిగుమతి చేసుకున్నట్లే, ఎల్‌పీజీని కూడా దిగుమతి చేసుకుంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఒకవేళ, రష్యా నుంచి ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంటే, మన దేశంలో గ్యాస్‌ ధరలు తగ్గే అవకాశం ఉంది.



ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత, యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిషేధించాయి. ఆ పరిస్థితిని భారతదేశం చక్కగా ఉపయోగించుకుంది, రష్యా నుంచి చాలా తక్కువ ధరకు క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ రేట్లు పెరిగినప్పటికీ, రష్యా నుంచి మన దేశానికి చవక ధరకే ముడి చమురు దిగుమతి అవుతోంది. దీంతో భారతీయ చమురు కంపెనీలు భారీగా లాభాలు ఆర్జించాయి. అయితే, సామాన్య వినియోగదారుల కోసం పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం భారత ప్రభుత్వం తగ్గించలేదు.


మరో ఆసక్తికర కథనం: రూ.600 పెరిగిన ప్యూర్‌ గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 24K, 22K పసిడి ధరలు ఇవీ