Telangana Weather Today | అమరావతి: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను గత వారం రోజుల నుంచి ఇబ్బంది పెట్టిన అల్పపీడనం బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు నేడు సైతం సముద్రంలో వేటకు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరించారు. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌లో నేడు (డిసెంబర్ 27న) దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలో అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గత వారం రోజులనుంచి వర్షాలు కురుస్తుండటంతో పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, యానాం, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో చలి పంజా
తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ప్రభావం సాధారణంగా ఉండనుంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. 5 రోజులపాటు ఉదయం వేళలో కొన్ని జిల్లాల్లో పొగ మంచు ఏర్పడుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గనున్నాయి. చలి తీవ్ర మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలి నుంచి చిన్నారులు, పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని.. వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశం ఉందని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు తేలికపాటి వర్షం లేక చిరుజల్లులు పడే అవకాశం కనిపిస్తోంది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు, 20 డిగ్రీల మేర నమోదు కానున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న శీతల గాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. మరో నాలుగైదు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతల మరింత దిగి రానున్నాయని, ప్రజలు చలి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
Also Read: Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం