Interchange Fees For ATM Cash Withdrawal: డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఒకప్పుడు బ్యాంక్‌కు వెళ్లే ప్రజలు ఇప్పుడు ఏటీఎం కేంద్రానికి వెళ్తున్నారు. ఏటీఎం లేకపోతే జనం చేతిలో డబ్బు ఆడదు. అయితే.. ఐదు ఉచిత లావాదేవీల పరిమితిని మించితే విధించే ఛార్జీలు & ATM ఇంటర్‌ఛేంజ్ ఫీజులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని అర్థం, ప్రజలు ATM నుంచి నగదు తీసుకోవడానికి ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. 


ఛార్జీ ఎంత పెరుగుతుంది?
హిందు బిజినెస్‌లైన్‌ రిపోర్ట్‌ ప్రకారం, 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI), ATM నుంచి 5 ఉచిత నగదు లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత, ప్రతి నగదు ఉపసంహరణపై ఫీజ్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 21 నుంచి రూ. 22 కి పెంచాలని సిఫార్సు చేసింది. అంతేకాదు, నగదు లావాదేవీలకు ATM ఇంటర్‌ఛేంజ్ రుసుమును రూ. 17 నుంచి రూ. 19 కి పెంచాలని కూడా చెల్లింపుల నియంత్రణ సంస్థ సిఫార్సు చేసింది. పరిశ్రమ వర్గాలతో చర్చించిన తర్వాత ఈ సిఫార్సులు చేసిందని తెలుస్తోంది.


సొంత బ్యాంక్‌ ఏటీఎం నుంచి కాకుండా మరొక బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బు ఉపసంహరిస్తే, ఒక నిర్దిష్ట పరిమితి తర్వాత, ఇంటర్‌ఛేంజ్ ఫీజ్‌ను మీ బ్యాంక్‌ వసూలు చేస్తుంది. ఈ డబ్బు మీ అకౌంట్‌ నుంచి కట్‌ అవుతుంది. వేరొక బ్యాంక్‌ ATM సర్వీస్‌ను ఉపయోగించుకున్నందుకు బదులుగా, ఆ బ్యాంక్‌కు మీ బ్యాంక్‌కు చెల్లించే సేవా రుసుము ఇది. మీరు ఏటీఎం లావాదేవీ చేసిన తర్వాత, ఆ ఫీజ్‌ మొత్తం మీ ట్రాన్జాక్షన్‌ స్లిప్‌పై కూడా కనిపిస్తుంది.


బ్యాంక్‌ అధికార్లతో కమిటీ!
హిందు బిజినెస్‌లైన్‌ రిపోర్ట్‌ ప్రకారం, మెట్రో & నాన్ మెట్రో ప్రాంతాలలో ఛార్జీలను పెంచాలన్న NPCI ప్రణాళికతో బ్యాంకులు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు ఏకీభవించారు. అయితే, ఈ పరిణామంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, NPCI ఇంకా అధికారికంగా ఏమీ వెల్లడించలేదు. ఛార్జీల పెంపు కోసం IBA CEO నేతృత్వంలో RBI రెండో కమిటీని ఏర్పాటు చేసిందని & ఈ కమిటీలో SBI, HDFC బ్యాంక్ అధికారులు ఉన్నారన్నది అధికార వర్గాలు ఇచ్చిన సమాచారం.


ప్రైవేట్ & ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖర్చును అంచనా వేసిన తర్వాత, గత ఏడాది సెప్టెంబర్‌లో దీని గురించి NPCI సిఫార్సు చేసిందని తెలుస్తోంది. NPCI సిఫార్సులను మెట్రో నగరాల్లో అమలు చేసే అవకాశం ఉంది. మెట్రోయేతర ప్రాంతాల్లో (గ్రామీణ & సెమీ అర్బన్ ప్రాంతాలు) దీనిని ఎలా అమలు చేయాలన్నదే సమస్యగా కనిపిస్తోంది.


పెరుగుతున్న ఏటీఎం నిర్వహణ ఖర్చు
గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం పెరగడం, రుణ వ్యయాలు 1.5-2 శాతం పెరగడం, రవాణా ఖర్చులు, నగదు భర్తీ ఖర్చులు పెరగడం వల్ల మెట్రోయేతర ప్రాంతాల్లో ఏటీఎం కార్యకలాపాల ఖర్చు పెరిగిందని న్యూస్‌ రిపోర్ట్‌ పేర్కొంది. పెరుగుతున్న ఖర్చుల భారం బ్యాంకుల మీద పడకుండా, ఆ బరువును ఏటీఎం యూజర్లకు బదిలీ చేసేందుకు ఛార్జీలను పెంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ యోచిస్తోందని తెలుస్తోంది. 


మరో ఆసక్తికర కథనం: బ్రేకింగ్ న్యూస్‌ - NPS, NPS లైట్, NPS వాత్సల్య ఛార్జీల్లో మార్పులు