IDBI Bank Privatisation: ఐడీబీఐ బ్యాంక్‌లో తనకున్న వాటాలో 30.24 శాతం అమ్మడం ద్వారా రూ. 21,624 కోట్ల పెట్టుబడిని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) తిరిగి పొందుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాంక్‌ ప్రైవేటీకరణను పూర్తి చేసే సమయానికి షేర్ ధరలు 2019 స్థాయికి పుంజుకునే అవకాశం ఉంటుందన్న అంచనాల ఆధారంగా ఈ మొత్తాన్ని లెక్కేశారు.


గత ఏడాది మేలో IDBI బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి షేరు ధర ₹35 నుంచి ప్రస్తుతం ₹45కి పెరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో బిడ్స్‌ పిలిచారు కాబట్టి స్టాక్‌ రైజింగ్‌లో ఉంది. 2019లో ఈ బ్యాంక్‌లో వాటాను LIC కైవసం చేసుకున్న ధరకు దగ్గరగా మళ్లీ స్క్రిప్‌ చేరుతుందని భావిస్తున్నారు.


LICకి 49.24 శాతం వాటా
ప్రస్తుతం, IDBI బ్యాంకులో భారత ప్రభుత్వం, LICకి కలిపి మొత్తం 94.72 శాతం వాటా ఉంది. విడివిడిగా చూస్తే... LICకి 49.24 శాతం (529.41 కోట్ల షేర్లు) స్టేక్‌, భారత ప్రభుత్వానికి 45.48 శాతం (488.99 కోట్ల షేర్లు) వాటా ఉంది. మిగిలిన 5.28  శాతం పబ్లిక్‌ చేతిలో ఉంది. తమకు ఉన్న స్టేక్‌లో... LIC 30.24 శాతం, భారత ప్రభుత్వం 30.48 శాతం వాటాను అమ్మకానికి పెట్టాయి. రెండూ కలిపి 60.72 శాతం స్టేక్‌ విక్రయించబోతున్నాయి. ఈ లావాదేవీ పూర్తయితే, ఈ బ్యాంకులో భారత ప్రభుత్వానికి 15 శాతం వాటా, LICకి 19 శాతం వాటా మిగులుతుంది. ఇవి రెండూ కోల్పోయే నియంత్రణ వాటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రైవేటు పరం అయిన తర్వాత అయినా ఈ బ్యాంక్‌ దశ - దిశ మారుతుందన్నది ఇన్వెస్టర్ల ఆశ. అందుకే, IDBI బ్యాంక్‌ షేర్లను ఎగబడి కొంటున్నారు.


అంతేకాదు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (PCA) ఫ్రేమ్‌వర్క్ నుంచి బ్యాంక్‌ను బయటకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం, LIC కలిసి మరో ₹9,300 కోట్లను IDBI బ్యాంక్‌లోకి తీసుకెళ్లాయి.


ప్రభుత్వ విభాగమైన దీపమ్‌ (Department of Investment and Public Asset Management) బిడ్లను ఆహ్వానించింది. ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ మొత్తాన్ని ఈ విభాగం చూసుకుంటోంది.


ఒక్కో షేరును ₹61 చొప్పున కొనుగోలు
2019లో, IDBI బ్యాంక్‌లో 51 శాతం వాటాను LIC కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు సగటు ధర ₹61 చొప్పున ₹21,624 కోట్లను వెచ్చించింది. 2020 డిసెంబర్‌లో QIP ఇష్యూ తర్వాత LIC వాటా 49 శాతానికి తగ్గింది.


గురువారం స్టాక్‌ మార్కెట్‌ సెషన్‌లో, BSEలో 2.16 శాతం పెరిగిన IDBI బ్యాంక్ షేర్లు రూ. 44.95 వద్ద ముగిశాయి. ఈ మార్కెట్ ధర ప్రకారం 61 శాతం వాటాను అమ్మినా ఖజానాకు దాదాపు ₹29,000 కోట్లు వస్తాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.