ICC World Cup 2023 - Indian Economy: ఆదివారం (19 నవంబర్ 2023) భారత క్రికెట్ అభిమానుల గుండె బద్ధలైంది. అలా జరిగి ఉండకూడదని, అది కల అయితే బాగుండని ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కోరుకున్నాడు. వరల్డ్ కప్ క్రికెట్ 2023 టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ టీమ్ (Rohit Sharma), కప్పు అందుకునే చిట్టచివరి మెట్టుపై పట్టు తప్పి పడిపోయింది. వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో భారత్ ఓడింది. విరాట్ కోహ్లి‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును (ICC World Cup Cricket 2023 Player of The Series Virat Kohli) అందుకున్నాడు.
ఆట పరంగా మన దేశానికి ఇది గుండెకోతే అయినా, భారత ఆర్థిక వ్యవస్థకు మాత్రం చాలా ప్రయోజనాలు అందాయి.
భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేసిన ఐసీసీ ప్రపంచకప్ 2023 (ICC World Cup 2023 benefits Indian Economy)
BOB ఎకనామిక్స్ రిపోర్ట్ ప్రకారం, మన దేశంలోని చాలా రంగాల్లో ఐసీసీ టోర్నీ దీపావళి వెలుగులు నింపింది. ఈ ఈవెంట్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి క్రికెట్ జట్లు, అభిమానులు తరలి వచ్చారు. దీనివల్ల విమానయానం, రవాణా రంగాలకు బాగా డబ్బులు వచ్చాయి. హోటళ్లు, ఫుడ్ ఇండస్ట్రీ, డెలివరీ సర్వీసులతో కూడిన హాస్పిటాలిటీ సెక్టార్ కూడా లాభపడింది. ఫుడ్ తింటూ ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఆస్వాదించేందుకు, అభిమానులు చిరుతిళ్లు, కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువగా కొన్నారు.
వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో, మొత్తం టిక్కెట్ల అమ్మకాలు (ICC World Cup 2023 ticket sales) రూ.1,600-2,200 కోట్ల వరకు ఉంటాయని BOB రిపోర్ట్‌లో ఉంది. టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌ల్లో మొత్తం వీక్షకుల సంఖ్య (ICC World Cup 2023 Wiewership) టీవీ, OTT ఫ్లాట్‌ఫామ్స్ కలిపి గణనీయంగా పెరిగింది. గత వరల్డ్ కప్‌లోని వ్యూయర్‌షిప్ (552 million Indian wiewership in 2019 World Cup Cricket) కంటే చాలా ఎక్కువగా ఉంటుందని BOB అంచనా వేసింది. ఈ వ్యూయర్‌షిప్‌ను బట్టి, స్పాన్సర్‌షిప్/టీవీ హక్కులు దాదాపు రూ. 10,500-12,000 కోట్లకు చేరుకోవచ్చని లెక్కగట్టింది.
ఈ మెగా ఈవెంట్‌కు విదేశీ క్రికెట్ అభిమానులు కూడా తరలివచ్చారు. ఒక్కో మ్యాచ్‌కు సగటున 1,000 మంది ఫారిన్ టూరిస్టులు వచ్చారని ఊహించినా... ఇండియాలో వాళ్ల షాపింగ్, హోటల్, ఆహారం, ప్రయాణాల కోసం రూ.450-600 కోట్లు ఖర్చు చేసి ఉండవచ్చు.
మ్యాచ్‌లు చూడడానికి ఇండియా అభిమానులు చేసిన ప్రయాణాలు, వాహనాల కోసం ఇంధనం, హోటళ్లలో బస, ఫుడ్ వంటి వాటి కోసం రూ.300-500 కోట్లు ఖర్చు చేసి ఉండొచ్చని అంచనా.
ఇక, రెస్టారెంట్లు, కేఫ్‌లకు వెళ్లి మ్యాచ్‌లు చూసిన వాళ్లు అక్కడే తిన్నారు, తాగారు. ఇళ్లలోనే ఉండి మ్యాచ్‌లు చూసినవాళ్లు వివిధ యాప్‌ల ద్వారా ఫుడ్ ఆర్డర్లు పెట్టారు. ఇలా.. ఈవెంట్ మొత్తం టైమ్‌లో రూ. 4,000-5,000 కోట్లు ఖర్చు చేసి ఉండవచ్చు.
మొత్తం వ్యయం రూ.18,000-22,000 కోట్లు + GST
ఈ లెక్కలన్నీ కలిపితే, ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం ప్రజలు చేసిన మొత్తం వ్యయం రూ. 18,000-22,000 కోట్ల రేంజ్‌లో ఉంటుందని BOB భావిస్తోంది. ఈ మొత్తం, మన దేశ ఆర్థిక వ్యవస్థకు (India GDP) బలమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
ఇది మాత్రమే కాదు.. అమ్మకాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీపై GST ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోకి పన్ను వసూళ్లు పెరుగుతాయి. వివిధ రంగాల నుంచి వచ్చే జీఎస్‌టీ మొత్తాలతో కేంద్ర ప్రభుత్వ ఖజానా మరింతగా నిండుతుంది. అయితే, ఇవన్నీ అంచనాలు మాత్రమే. ఖచ్చితమైన లెక్కలు అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: 4 ట్రిలియన్ డాలర్లకు ఇండియా జీడీపీ! ఈ న్యూస్ నిజమేనా?