Hurun Global Rich List 2024: ఆర్థిక వ్యవస్థలు, సంపద గురించి అధ్యయనం చేసే ప్రముఖ సంస్థ హురున్, 2024 సంవత్సరానికి ప్రపంచ సంపన్నుల లిస్ట్‌ను విడుదల చేసింది. హురున్ రిచ్ లిస్ట్ (Hurun India Rich List 2024) ప్రకారం, భారత్‌లో ఆల్ట్రా రిచ్ పీపుల్ సంఖ్య పెరిగింది. మన దేశంలో, రూ.1000 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య 1,319 కు చేరింది. రూ.1000 కోట్ల ప్లస్ క్లబ్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య 1300 దాటడం ఇదే తొలిసారి.
దేశాలవారీగా చూస్తే.. భారతదేశంలో 271 మంది శ్రీమంతులు ఉండగా, చైనాలో 814 మంది ఉన్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023లో, భారతదేశ శ్రీమంతుల సంఖ్య 216 గా ఉంది. గత ఐదేళ్లలో, మన దేశంలో కుబేరుల సంఖ్య 76 శాతం పెరిగిందని హురున్ వెల్లడించింది. భారతీయ ధనవంతుల మొత్తం సంపద 51% పెరిగి 1 లక్ష కోట్ల డాలర్లకు చేరిందని లెక్కలు విడుదల చేసింది.
లిస్ట్‌లోకి కొత్తగా ఎక్కిన లక్ష్మీపుత్రుల విషయంలో భారత్ జోరు మీద ఉంది, చైనాను దాటి చాలా ముందుకు వెళ్లింది. 2024 సంవత్సరానికి, భారత్ నుంచి హురున్ లిస్ట్‌లో కొత్తగా 94 మంది చోటు సంపాదిస్తే, 55 మంది చైనీయులు పేర్లు నమోదు చేసుకున్నారు. భారత ఆర్థిక & కుబేరుల రాజధాని ముంబై నుంచి కొత్తగా 27 మందికి క్లబ్‌లో మెంబర్‌షిప్ దక్కితే, బీజింగ్ నుంచి ఆరుగురికే ఆ ఛాన్స్ వచ్చింది.
హురున్ లిస్ట్ ప్రకారం, టాప్-10 ప్రపంచ ధనవంతుల్లో 8 మంది అమెరికన్లు. ఒకరు ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంటే, భారత్ నుంచి ముకేష్ అంబానీకి టాప్-10లో చోటు దక్కింది. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నారు. ఆయన ఆస్తిపాస్తుల మొత్తం విలువ 231 బిలియన్ డాలర్లు లేదా దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు. భారత్‌తో పాటు ఆసియాలోనూ అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ, ప్రపంచ ధనవంతుల్లో 10వ స్థానంలో నిలిచారు. అంబానీ సంపద విలువ (Mukesh Ambani Networth) 115 బిలియన్ డాలర్లు. భారత్‌లో రెండో కోటీశ్వరుడైన గౌతమ్ అదానీ (Gautam Adani Networth) ఆస్తులు ఏడాది వ్యవధిలోనే 62% పెరిగాయి, 86 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచ ధనవంతుల్లో అదానీది 15వ ప్లేస్.
టాప్-10 ప్రపంచ ధనవంతులు:
1. ఎలాన్ మస్క్ (Elon Musk) --------- సంపద విలువ 231 బిలియన్ డాలర్లు --------- దేశం: అమెరికా
2. జెఫ్ బెజోస్ (Jeff Bezos) --------- సంపద విలువ 185 బిలియన్ డాలర్లు --------- దేశం: అమెరికా
3. బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) --------- సంపద విలువ 175 బిలియన్ డాలర్లు --------- దేశం: ఫ్రాన్స్
4. మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) --------- సంపద విలువ 158 బిలియన్ డాలర్లు --------- దేశం: అమెరికా
5. లారీ ఎల్లిసన్ (Larry Ellison) --------- సంపద విలువ 144 బిలియన్ డాలర్లు --------- దేశం: అమెరికా
6. వారెన్ బఫెట్ (Warren Buffett) --------- సంపద విలువ 144 బిలియన్ డాలర్లు --------- దేశం: అమెరికా
7. స్టీవ్ బామర్ (Steve Ballmer) --------- సంపద విలువ 142 బిలియన్ డాలర్లు --------- దేశం: అమెరికా
8. బిల్ గేట్స్ (Bill Gates) --------- సంపద విలువ 138 బిలియన్ డాలర్లు --------- దేశం: అమెరికా
9. లారీ పేజ్ (Larry Page) --------- సంపద విలువ 123 బిలియన్ డాలర్లు --------- దేశం: అమెరికా
10. ముకేష్ అంబానీ (Mukesh Ambani) --------- సంపద విలువ 115 బిలియన్ డాలర్లు --------- దేశం: భారత్
టాప్-100 ప్రపంచ సంపన్నుల క్లబ్‌లోకి భారత్ నుంచి ఆరుగురికి ఎంట్రీ పాస్ దక్కింది. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీతో పాటు శివ్ నాడార్, సైరస్ పూనావాలా, కుమార మంగళం బిర్లా, రాధాకిషన్ దమానీ ఈ లిస్ట్‌లో ఉన్నారు.
మరో ఆసక్తికర కథనం: బిలియనీర్ల రాజధాని బీజింగ్ కాదు, ముంబై - పెరిగిన లక్ష్మీపుత్రులు