Soaps, Personal Care And Skincare Product Prices Increased: దేశంలో పచ్చిమిర్చి నుంచి పప్పుల వరకు ప్రతి నిత్యావసర వస్తువు రేటు పెరుగుతోంది. కూరగాయల నుంచి కిరాణా వరకు, సామాన్యులు ప్రతిరోజు ఉపయోగించే ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతోంది. ఈ జాబితాలోకి ఇప్పుడు సబ్బు (Soap) కూడా చేరింది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL), విప్రో (Wipro) వంటి ప్రధాన కంపెనీలు సబ్బుల ధరలను సుమారు 7 నుంచి 8 శాతం వరకు పెంచాయి.
సబ్బును తయారు చేయడంలో కీలక ముడి పదార్థం పామాయిల్. మన దేశం పామాయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో, పామాయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి ఎగుమతులు తగ్గాయి. దీంతో, ప్రపంచ మార్కెట్లలో పామాయిల్ రేట్లు పెరిగాయి. ఈ ప్రభావం సబ్బులను ఉత్పత్తి చేస్తున్న హెచ్‌యూఎల్, విప్రో, టాటా కన్స్యూమర్ వంటి కంపెనీలపైనా పడింది. పామాయిల్ ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, ఆయా కంపెనీలు సబ్బుల రేట్లు పెంచాయి. పెరిగిన ఆర్థిక భారాన్ని సామాన్య జనంపైకి నెట్టాయి.
సెప్టెంబర్ త్రైమాసిక (జులై-సెప్టెంబర్) ఫలితాల ప్రకటన సమయంలో, తమ లాభాలను కాపాడుకోవడానికి ప్రస్తుత త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) సబ్బు ధరలను పెంచామని అనేక లిస్టెడ్ కంపెనీలు వెల్లడించాయి.
పామాయిల్ ధరలు ఎంత పెరిగాయి?
దిగుమతి సుంకం పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల కారణంగా, ఈ ఏడాదిలో పామాయిల్ ధరలు దాదాపు 35-40 శాతం పెరిగాయి. మన దేశంలోకి పామాయిల్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం, పామాయిల్ ధర 10 కిలోలు రూ. 1,370 పలుకుతోంది.
"సబ్బు తయారీకి సంబంధించిన కీలక ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం ముడి పదార్థాల రేట్లు 30 శాతానికి పైగా పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా ప్రధాన వ్యాపార కంపెనీలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెరుగుదల భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి, మా ఉత్పత్తుల ధరలను సుమారు 7-8 శాతం పెంచాం. మార్కెట్‌లోని ప్రైస్ ట్రెండ్‌కు అనుగుణంగా పని చేస్తున్నాం" - విప్రో కన్స్యూమర్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నీరజ్ ఖత్రి
విప్రో అనేది అజీమ్ ప్రేమ్‌జీ నేతృత్వంలోని విప్రో ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన యూనిట్. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే సంతూర్ సహా మరికొన్ని సోప్ బ్రాండ్లను ఇది అమ్ముతోంది.
లక్స్, లైఫ్‌బాయ్, డోవ్...
దిగ్గజ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కూడా సబ్బులు, స్కిన్ కేర్ (Skincare) ఉత్పత్తుల రేట్లు పెంచింది. లక్స్ 5 సబ్బుల ప్యాకెట్ రేటును రూ. 145 నుంచి రూ. 155కు పెంచింది. లైఫ్‌బాయ్ 5 సబ్బుల ప్యాకెట్ ధరను రూ. 155 నుంచి రూ. 165కు పెంచింది. పియర్స్ 4 సబ్బుల ప్యాకెట్ రేటును రూ. 149 నుంచి రూ. 162 చేసింది. ఇంకా.. లిరిల్, రెక్సోనా బ్రాండ్‌లను కూడా HUL ఉత్పత్తి చేస్తోంది. మార్కెట్ వర్గాల ప్రకారం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల (Personal Care Products) ధరలు కూడా పెరిగాయి.
HUL, విప్రో తర్వాత మరికొన్ని కంపెనీలు కూడా సబ్బులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని రీసెర్చ్ హౌస్ 'నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్' వెల్లడించింది.
పెరిగిన 'టీ పొడి' రేట్లు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తేయాకు ఉత్పత్తి కూడా తగ్గింది. దీంతో, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, హెచ్‌యూఎల్ తమ టీ పొడి రేట్లను పెంచాయి.
మరో ఆసక్తికర కథనం: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?