HDFC - Rupay Credit Card: UPIతో మన బ్యాంక్‌ అకౌంట్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ను లింక్‌ చేసి పేమెంట్‌ చేయడం గురించి అందరికీ తెలుసు. దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల UPIని క్రెడిట్ కార్డ్‌తోనూ లింక్ చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి, చాలా బ్యాంకులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌ను UPIతో లింక్ చేసే సదుపాయాన్ని ప్రారంభించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి HDFC బ్యాంక్ పేరు కూడా చేరింది. అంటే... QR కోడ్‌ను స్కాన్‌ చేసి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి చెల్లింపులు చేసినట్లుగానే, క్రెడిట్‌ కార్డ్‌ నుంచి కూడా UPI చెల్లింపులు చేయవచ్చు. 


HDFC బ్యాంక్, NPCI జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు HDFC బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ని UPI IDకి (HDFC RuPay Credit Card Link with UPI) లింక్ చేయవచ్చు. లింక్‌ చేసే ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


HDFC బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూపే క్రెడిట్ కార్డ్‌ని యుపీఐతో లింక్ చేసే (HDFC RuPay Credit Card Link with UPI) సదుపాయాన్ని ప్రవేశపెట్టడం వల్ల కోట్లాది మంది బ్యాంక్ కస్టమర్లు ప్రయోజనం పొందుతారు. UPI ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయగలుగుతారు. 


HDFC బ్యాంక్‌ రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేయడం ఎలా? 


HDFC రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేసే ప్రక్రియ చాలా సులభం. ఇందుకోసం ముందుగా BHIM యాప్‌ని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఆ తర్వాత, మీ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ పేరును ఎంచుకోండి.
ఇక్కడ, మీ క్రెడిట్‌ కార్డ్‌తో లింక్‌ అయిన మొబైల్ నంబర్‌ను పూరించండి.
దీని తర్వాత, కార్డును ఎంచుకుని, కన్ఫర్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
దీని తర్వాత మీ UPI పిన్‌ను జనరేట్‌ చేయండి. ఈ పిన్‌ను (PIN) కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ పిన్‌ లేకుండా మీరు ఏ ఒక్క లావాదేవీ కూడా చేయలేరు.


రూపే క్రెడిట్ కార్డ్‌తో UPI చెల్లింపు ఎలా చేయాలి?


చెల్లింపు చేయడానికి, ముందుగా UPI QR కోడ్‌ని స్కాన్ చేయండి.
ఆ తర్వాత మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని పూరించండి.
దీని తర్వాత క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ ఎంచుకోండి.
మీరు జెనరేట్‌ చేసిన UPI పిన్‌ను ఇక్కడ నమోదు చేయండి.
దీంతో మీ చెల్లింపు పూర్తవుతుంది.   


రూపే క్రెడిట్ కార్డ్‌తో UPI చెల్లింపులు అనుమతిస్తున్న బ్యాంకులు
HDFC బ్యాంక్‌తో పాటు... పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే క్రెడిట్ కార్డ్, ఇండియన్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌తోనూ UPI చెల్లింపులు చేయవచ్చు. ఈ మూడు బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసే ప్రక్రియ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రక్రియ మాదిరిగానే ఉంటుంది. పేటీఎం ద్వారా కూడా ఈ తరహా చెల్లింపులు చేయవచ్చు.