Happy Birthday Ratan Tata: భారతదేశంలోని అతి పెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరు రతన్ టాటా. ఈ రోజు (28 డిసెంబర్ 2023), తన 86వ పుట్టిన రోజును (Ratan Tata's 86th birthday) జరుపుకుంటున్నారు. రతన్ టాటా గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా మాత్రమే కాదు, అపర దానకర్ణుడిగానూ అందరికీ తెలిసిన వ్యక్తి.
1937లో, ముంబైలో నవల్ టాటా, సునీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. రతన్ టాటాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత.. అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద రతన్ పెరిగారు.
రతన్ టాటా ప్రారంభ జీవితం
రతన్ టాటా విద్యాభ్యాసం ముంబై మొదలైంది. ఆ తర్వాత, 1955లో సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్, న్యూయార్క్‌లోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్ నుంచి డిప్లొమా చేసారు. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు, ఆయన బ్రహ్మచారి. 1962లో లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని భావించామని ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా చెప్పారు. అయితే, ఇండియా-చైనా యుద్ధం కారణంగా ఆమె తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఇండియా రానివ్వలేదని వెల్లడించారు. ఆ తర్వాత రతన్ టాటా భారతదేశానికి తిరిగి వచ్చారు, వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు.
రతన్ టాటా కెరీర్ (Ratan Tata Career)
టాటా గ్రూప్‌లోని (Tata Group) ప్రముఖ కంపెనీ టాటా స్టీల్‌లో, 1961లో, తన కెరీర్‌ను రతన్ టాటా ప్రారంభించారు. ఆ తరువాత, 1975లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదవడానికి హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కి వెళ్ళారు. కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుండి డిగ్రీ కూడా పొందారు. ఆర్థిక కోణం దృష్ట్యా భారతదేశానికి 1991 సంవత్సరం ఒక మైలురాయి లాంటింది. దేశ ఆర్థిక విధానాల్లో సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాన్ని అప్పుడు అవలంబించారు. ఆ తర్వాత రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు. రతన్ టాటా నాయకత్వంలో, టాటా గ్రూప్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది.
2004లో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను పబ్లిక్‌లోకి (TCS IPO) తీసుకురావాలని రతన్ టాటా నిర్ణయించారు. ఆటోమొబైల్ రంగంలో, టాటా ఆంగ్లో-డచ్ స్టీల్ తయారీ సంస్థ కోరస్, బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్, బ్రిటిష్ టీ సంస్థ టెట్లీ వంటి చాలా గ్లోబల్ బ్రాండ్స్‌ను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. దీని తర్వాత టాటా గ్రూప్ ప్రపంచ పెద్ద బ్రాండ్స్‌లో ఒకటిగా అవతరించింది.
సామాన్య ప్రజల సొంత కారు కలను నెరవేర్చడానికి, 2009లో, లక్ష రూపాయల కారు నానోను (Nano) రతన్ టాటా విడుదల చేశారు. ఇది రతన్ టాటా కల కూడా.
రతన్ టాటా నుంచి భూరి విరాళాలు (Huge donations from Ratan Tata)
వ్యాపార దక్షతలోనే కాదు, దాతృత్వ విషయాల్లోనూ రతన్ టాటా ముందు వరుసలో ఉంటారు. భారతీయ విద్యార్థులకు సాయం చేయడానికి 28 మిలియన్ డాలర్లను కార్నెల్ విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. ఆ డబ్బుతో పేద & మధ్య తరగతి భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థుల కోసం 50 మిలియన్ డాలర్లు ఇచ్చారు. ఐఐటీ బాంబేలో పరిశోధనలను ప్రోత్సహించడానికి 2014లో రూ.95 కోట్లను విరాళంగా ఇచ్చారు. అంతేకాదు, ప్రతి సంవత్సరం తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛంద సేవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.
రతన్ టాటా ఆస్తుల విలువ (Value of Ratan Tata's assets)
ఎక్స్‌లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న భారతీయ పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. ఆయనకు 'X'లో 12 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, రతన్ టాటా నికర విలువ (Ratan Tata's Net Worth) రూ. 3,800 కోట్లకు పైమాటే. IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం, రతన్ టాటా ప్రపంచంలోని 421వ అత్యంత సంపన్న వ్యక్తి.
మరో ఆసక్తికర కథనం: ట్రేడింగ్ ఆగిపోకుండా ఇన్వెస్టర్లను పెద్ద కష్టం నుంచి గట్టెక్కించిన సెబీ