Gst Collections:
డిసెంబర్ నెలలో రూ.1.49 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 15 శాతం వృద్ధిరేటు నమోదైందని పేర్కొంది. నవంబర్లో రూ.1.46 లక్షల కోట్లు రాగా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ నెలలో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు సృష్టించాయి. ఏకంగా రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైంది. రూ.1.52 లక్షల కోట్లతో అక్టోబర్ రెండో స్థానంలో నిలిచింది. డిసెంబర్లో రూ.1,49,507 కోట్లు వసూళ్లవ్వగా సెంట్రల్ జీఎస్‌టీ రూ.26,711 కోట్లు, స్టేట్ జీఎస్‌టీ రూ.33,357 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.78,434 కోట్లుగా ఉన్నాయి. ఐజీఎస్‌టీ నుంచి రూ.36,669 కోట్లను సీజీఎస్‌టీకి, రూ.31,094ను ఎస్‌జీఎస్టీకి బదిలీ చేశారు.
కేంద్రానికి డిసెంబర్లో రూ.63,380 కోట్లు, రాష్ట్రాలకు రూ.64,451 కోట్ల ఆదాయం వచ్చింది. వస్తు దిగుమతుల ద్వారా వచ్చిన రాబడి 8 శాతం అత్యధికంగా ఉంది. డొమస్టిక్ లావాదేవీల రాబడి 18 శాతం అధికంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్లో 7.9 కోట్ల ఈవే బిల్లులు జనరేట్ అయ్యాయి.
తెలంగాణలో 2021 డిసెంబర్లో రూ.3760 కోట్లు జీఎస్‌టీ రూపంలో రాబడి రాగా 2022లో 11 శాతం వృద్ధితో రూ.4178 కోట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో అంతకు ముందు రూ.2532 కోట్లు వసూలు చేయగా ఈసారి 26 శాతం వృద్ధితో రూ.3182 కోట్లు చేసింది. మహారాష్ట్ర 20 శాతం వృద్ధితో అత్యధికంగా రూ.19,592 కోట్లు వసూలు చేసింది. కర్ణాటక (రూ.10,061 కోట్లు), గుజరాత్ (రూ.9238 కోట్లు), తమిళనాడు (రూ.8323 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.