Harirama Jogaiah : కాపు రిజర్వేషన్ల సాధించడానికి తాను చావడానికైనా సిద్ధమని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి అల్టివేటం జారీ చేశారు. సోమవారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. పాలకొల్లులోని గాంధీ సెంటర్‌లో రేపటి నుంచి నిరాహార దీక్ష చేస్తానని హరిరామజోగయ్య తెలిపారు. నిరాహార దీక్షకు అనుమతి కోరినా పోలీసులు ఇవ్వలేదన్నారు. దీక్షను భగ్నం చేసినా, ఆస్పత్రికి తరలించినా దీక్ష కొనసాగిస్తానని హరిరామజోగయ్య చెప్పారు. కాపులు ఆర్థికంగా ఎదగడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. కాపులపై సీఎం జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బిల్లు గవర్నర్ ఆమోదం పొందే సమయానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. దీంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు దక్కలేదని ఆరోపించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో కాపులకు చేసిందేంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లపై వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరాహారదీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వానికి డిసెంబర్ 30 వరకు డెడ్ లైన్ పెట్టారు హరిరామజోగయ్య. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
నిరాహార దీక్ష
ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాపులకు రిజర్వేషన్ల కల్పనపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వీకర్స్ సెక్షన్ కింద కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని హరిరామ జోగయ్య డెడ్ లైన్ విధించారు. లేకపోతే జనవరి 2 నుంచి నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా, వాటిలో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ హయాంలో ప్రయత్నించారన్నారు. బిల్లు గవర్నర్ ఆమోదం పొందే సమయానికి వైసీపీ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మూడేళ్లలో సీఎం జగన్ కాపులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈనెల 30లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హరిరామ జోగయ్య తెలిపారు.
అయితే ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని హరిరామజోగయ్య డిమాండ్ కు మద్దతు తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం నుంచి జోగయ్య డిమాండ్ పై స్పష్టత రాలేదు. సీఎం జగన్ కాపు రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటారా? లేక వేచిచూసే ధోరణే అవలంభిస్తారో తెలియాల్సి ఉందని కాపు సంఘం నేతలు అంటున్నారు.